Share News

కదిలే.. వైద్యాలయాలు..!

ABN , Publish Date - Jan 24 , 2026 | 04:54 AM

విజయవాడలో మొబైల్‌ హెల్త్‌ వ్యాన్‌లు అందుబాటులోకి వచ్చాయి. సుజనా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు...

కదిలే.. వైద్యాలయాలు..!

  • విజయవాడలో మొబైల్‌ హెల్త్‌ వ్యాన్‌లు

  • పశ్చిమ నియోజకవర్గ ప్రజల కోసం.. సుజనా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు

విజయవాడ, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): విజయవాడలో మొబైల్‌ హెల్త్‌ వ్యాన్‌లు అందుబాటులోకి వచ్చాయి. సుజనా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు సేవలందించడానికి వీలుగా ఎమ్మెల్యే సుజనా చౌదరి రెండు వాహనాలను ఏర్పాటు చేశారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుక్రవారం వీటిని ప్రారంభించారు. రాష్ట్రంలో ఒక నియోజకవర్గ పరిధిలో ఇలాంటి హెల్త్‌ వ్యాన్‌లు ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఫోన్‌ చేస్తే చాలు.. ఈ కదిలే వైద్యాలయాలు రోగుల ఇళ్లకే వెళ్లి సేవలందిస్తాయి. విజయవాడ నగరంలోని అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్ల (యూపీహెచ్‌సీ)తో సమన్వయం చేసుకుంటూ ఇంటింటికీ వెళ్లి రోగ నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహిస్తాయి. అనంతరం అవసరమైన వారికి అక్కడే చికిత్స, మందులు అందిస్తారు. ఒకవేళ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే.. వెంటనే విజయవాడ ప్రభుత్వాస్పత్రి, మంగళగిరిలోని ఎన్నారై, ప్రైవేటు ఆస్పత్రులకు రిఫర్‌ చేస్తారు.


1.35 కోట్లతో ఏర్పాటు చేసిన సుజనా ఫౌండేషన్‌

ఈ మొబైల్‌ వ్యాన్‌లను విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్యెల్యే సుజనా చౌదరికి చెందిన సుజనా ఫౌండేషన్‌ నిర్వహిస్తుంది. సుమారు రూ.1.35 కోట్లతో ఈ వాహనాలను ఏర్పాటు చేసింది. రోగం ముదిరాక ఆస్పత్రికి వెళ్లడం కంటే ముందుగానే రోగ నిర్థారణ పరీక్షలు చేసి వ్యాధి ముదరకుండా చేయడమే లక్ష్యంగా ఈ వాహనాలు సేవలందించనున్నాయి.

Updated Date - Jan 24 , 2026 | 04:55 AM