Share News

నిరుద్యోగులపై వైసీపీ గొడ్డలి పోటు

ABN , Publish Date - Jun 01 , 2026 | 05:18 AM

మెగా డీఎస్సీపై నిజనిర్ధారణ చేసుకోకుండా నిరుద్యోగుల భవిష్యత్తును గొడ్డలితో నరకాలని వైసీపీ చూస్తోందని ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు.

నిరుద్యోగులపై వైసీపీ గొడ్డలి పోటు

  • 2007లో నిరుద్యోగులు, ఉపాధ్యాయుల తలరాతను మార్చారు .. వైసీపీ హయాంలో గ్రూప్‌-1 పత్రాలు హాయ్‌ల్యాండ్‌లో దిద్దారు

  • మెగా డీఎస్సీలో మీ సానుభూతిపరులకూ ఉద్యోగాలు వచ్చాయి

  • డబ్బులిచ్చామని వారితో చెప్పించగలరా: ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి

కడప, మే 31(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీపై నిజనిర్ధారణ చేసుకోకుండా నిరుద్యోగుల భవిష్యత్తును గొడ్డలితో నరకాలని వైసీపీ చూస్తోందని ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం కడప నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపించడంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. డీఎస్సీ పరీక్షల అనంతరం 2025 ఆగస్టు 28న సర్టిఫికెట్ల పరిశీలనకు అభ్యర్థులను పిలిచారని తెలిపారు. వాటిని పరిశీలించిన అనంతరం చాలా అభ్యంతరాలు వచ్చాయని చెప్పారు. దీనికి సంబంధించిన కొన్ని ఉదాహరణలను ఆయన పేర్కొన్నారు. ‘కడప జిల్లాకు చెందిన అభ్యర్థి శ్రీకాంత్‌కు కాల్‌లెటర్‌ వచ్చింది. అయితే ఆయన చెన్నూరు మండలంలోని సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఒంగోలులోని బీపీఈడీ కళాశాలలో రెగ్యులర్‌గా చదువుకుంటున్నారని శ్రీకాంత్‌ కంటే జాబితాలో కింద ఉన్న వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేస్తే ఇక్కడ ఉద్యోగం చేస్తూ అక్కడ చదువుకుంటున్నాడని నిర్ధారణ అయింది. ఇక విజయభాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి కంటే ముందు ఉన్న సుహాసిని అనే అభ్యర్థికి ఉద్యోగం వచ్చింది. ఆమె దివ్యాంగుల కోటాలో ఉద్యోగం పొందినట్లు, ఆమె అనర్హురాలని ఫిర్యాదు చేశారు. పరీక్షల్లో 52 శాతం వినికిడి లోపం ఉందని సర్టిఫికెట్‌ ఇవ్వడంతో ఆమెకు ఉద్యోగం లభించింది. అలాగే ఎస్టీ అభ్యర్థి ఆంజనేయులుకు ఇంటర్‌లో 43.5 మార్కులు మాత్రమే వచ్చాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే సమయంలో 45 శాతం మార్కులు నమోదు చేసి పరీక్షకు హాజరయ్యారు. ఆయనకు ర్యాంక్‌ వచ్చినప్పటికీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో విషయం బయటపడింది.


తనకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేయడంతో అధికారులు ఆయనకు కారణం వివరించారు. రామకృష్ణ అనే వ్యక్తి బీసీ-ఏ కేటగిరీలో ఉన్నా తనకు ఉద్యోగం రాలేదని ఫిర్యాదు చేశారు. ఈ విభాగంలో 3 పోస్టులు ఉన్నాయి. రిజర్వేషన్‌ ప్రాతిపదికన వాటిలో ఒక మహిళకు, మరొకటి దివ్యాంగ అభ్యర్థికి, మరొకటి క్రీడా కోటాలో ఉద్యోగం ఇచ్చారు. ఈ విధంగా తమకు ఉద్యోగం రాలేదన్న వారందరి సందేహాలను నివృత్తి చేశారు. చట్టం ముందు నిలబడని ఇటువంటి కొన్ని కేసులను ఉదహరిస్తూ జగన్‌, వైసీపీ నాయకులు ఆయన మీడియాలో మాట్లాడుతున్నారు. అంతేకాకుండా చూసి రాశారని అంటున్నారు. మెగా డీఎస్సీ పరీక్షలు కంప్యూటర్‌లో నిర్వహించారు. అయినా కూడా చూసి రాసే అవకాశం ఉంటుందా? ఇవన్నీ తెలిసీ గందరగోళం సృష్టించాలని, ప్రభుత్వంపైన బురద చల్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు’’ అని రామగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారమే ఉద్యోగాలు ఇచ్చారని, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా రిజర్వేషన్‌ పాటించలేదని నిరూపించాలని వైసీపీ నాయకులకు ఆయన సవాల్‌ విసిరారు.


మీరిచ్చిన సర్టిఫికెట్లు నకిలీవా?

1994 నుంచి 2004 వరకు, 2014 నుంచి 2019 వరకు, 2024 నుంచి ఇప్పటి వరకు 142 మంది, జగన్‌ హయాంలో 2019 నుంచి 2024 వరకు 135 మంది, 2004 నుంచి 2014 వరకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆ తర్వాత వచ్చిన సీఎంల హయాంలో 105 మంది స్పోర్ట్స్‌ సర్టిఫికెట్లు పొందారని వివరించారు. మొత్తంగా 382 మంది క్రీడాకారులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అంటే వైఎ్‌సఆర్‌ హయాంలో, వైసీపీ హయాంలో ఇచ్చిన సర్టిఫికెట్లు నకిలీవా అని ఆయన ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వంలో స్పోర్ట్స్‌ కోటా కింద 2,300మందికి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారని, వారికి డబ్బులు తీసుకునే ఉద్యోగాలు ఇచ్చారా అని నిలదీశారు. 382 మంది అభ్యర్థుల జాబితాను వైసీపీ నాయకులకు ఇస్తామని, ఎవరైనా నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని నిరూపిస్తే ఏ శిక్ష వేసినా సిద్ధంగా ఉన్నామన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...

ఇష్టారాజ్యంగా టీచర్ల బదిలీలు

‘టీడీపీ హయాంలో టీచర్ల బదిలీలు రాజకీయాలకు అతీతంగా నిర్వహించాం. జగన్‌ హయాంలో ఎన్నికల నోటిఫికేషన్‌కు నెల ముందు అప్పటి విద్యాశాఖ మంత్రి, అధికారులు రూ.50 కోట్లు తీసుకుని డైరెక్ట్‌ ట్రాన్స్‌ఫర్లు చేశారు. జగన్‌ పాలనలో గ్రూప్‌-1 రిక్రూట్‌మెంట్లు జరిగితే 169మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. హాయ్‌ల్యాండ్‌లో పేపర్లు దిద్దారు. వైసీపీ హయాంలో ప్రజాప్రతినిధులు రూ.లక్షలు దండుకుని కడప జిల్లా పరిషత్‌లో 15మంది నకిలీ అభ్యర్థులకు కారుణ్య నియామకాలు ఇచ్చారు. దీంతో నిజమైన అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైసీపీ నాయకుల కుమారులకు, బంధువులకు, సానుభూతిపరులకు కూడా మెగా డీఎస్సీలో ఉద్యోగాలు వచ్చాయి. టీడీపీ నాయకులకు డబ్బులు ఎంత ఇచ్చారో వారిని అడగాలి. రాజకీయాలకు అతీతంగా, అత్యంత పారదర్శకంగా నియామకాలు చేపట్టిన ఘనత టీడీపీకే దక్కుతుంది’ అని రామ్‌ప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - Jun 01 , 2026 | 05:19 AM