అశాంతి, అనిశ్చితి సృష్టికి కుట్రలు: ఎమ్మెల్సీ భూమిరెడ్డి
ABN , Publish Date - May 30 , 2026 | 05:44 AM
‘సీఎం పదవి నుంచి దిగిపోయిన మొదటి రోజు నుంచే జగన్‌రెడ్డి రాష్ట్రంలో అశాంతి, అనిశ్చితి సృష్టించాలని కుట్రలు పన్నుతున్నారు. మళ్లీ ఎప్పుడు అధికారంలోకి...
అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): ‘సీఎం పదవి నుంచి దిగిపోయిన మొదటి రోజు నుంచే జగన్‌రెడ్డి రాష్ట్రంలో అశాంతి, అనిశ్చితి సృష్టించాలని కుట్రలు పన్నుతున్నారు. మళ్లీ ఎప్పుడు అధికారంలోకి వచ్చి దోపిడీలు చేయాలా అనే ఆలోచనతోనే జగన్ బతుకుతున్నారు’ అని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘16347 మంది ఉపాధ్యాయుల నియామకాలు పూర్తయి అందరూ ఉద్యోగాలు చేసుకుంటుంటే జగన్‌కి ఇప్పుడు డీఎస్సీలో అక్రమాలు జరిగాయని గుర్తుకు రావడం విడ్డూరంగా ఉంది. కేవలం కుట్రపూరిత ఆలోచనతోనే జగన్ ఈ ఆరోపణలు చేస్తున్నారు. జగన్ రెడ్డి తండ్రి వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో 2006లో డీఎస్సీ నిర్వహించారు. జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా నియామక ప్రక్రియ జరిగింది. ఆ సమయంలో వైఎస్సార్ బంధువులు ఒక్కో ఉద్యోగానికి రూ.10 లక్షలు చొప్పున వసూలు చేసి, ఏకంగా ఓఎంఆర్ షీట్లనే దిద్దేశారు. జగన్ హయాంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లోనూ ఎన్నో అక్రమాలు చోటుచేసుకున్నాయి. జగన్ హయాంలోనే కడప జిల్లా పరిషత్‌లో కారుణ్య నియామకాల్లోనూ దారుణమైన స్కాంకు తెరదీశారు. విచారణలో ఇవన్నీ తేలడంతో మూడు రోజుల క్రితం ఆ ఉద్యోగులందరినీ డిస్మిస్ చేశారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని నిరూపించే దమ్ము జగన్‌కు ఉంటే నిరూపించాలి’ అని భూమిరెడ్డి సవాల్ చేశారు.