జగన్.. ఒక్క ఎకరానికి నీరిచ్చినట్లు చూపించినా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా: భూమిరెడ్డి
ABN , Publish Date - Apr 12 , 2026 | 05:44 AM
‘వైసీపీ ప్రభుత్వంలో జగన్ ఒక్క ఎకరానికి అదనంగా నీరు ఇచ్చినట్లుగాని, సీమలో ఒక్క కాలువ తీసినట్లుగాని నిరూపిస్తే శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తా’ అని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు.
అనంతపురం క్రైం, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ ప్రభుత్వంలో జగన్ ఒక్క ఎకరానికి అదనంగా నీరు ఇచ్చినట్లుగాని, సీమలో ఒక్క కాలువ తీసినట్లుగాని నిరూపిస్తే శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తా’ అని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. టీడీపీ అనంతపురం జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వైసీపీ ప్రభుత్వంలోనే ఆగింది. వైసీపీ నేతల వల్లే రాయలసీమకు అన్యాయం జరిగింది. దీనిపై చర్చకు రాయలసీమలో ఏ సెంటర్‌కైనా వస్తాం. వారు సిద్ధమా? వైసీపీ నేతలు సీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మాపై ఉంది. వైసీపీ నాయకులు సీమకు తీరని అన్యాయం చేయడమేకాకుండా కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం రూ.3550 కోట్ల వ్యయంతో హంద్రీనీవా కాలువను వెడల్పు చేసి, కుప్పం వరకూ నీరు తీసుకెళ్లింది. రాయలసీమ అభివృద్ధికి సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారు. వైసీపీ తీరని ద్రోహం చేసింది’ అని భూమిరెడ్డి మండిపడ్డారు.