నోరు మెదపని అనంతబాబు!
ABN , Publish Date - May 06 , 2026 | 05:20 AM
‘‘మీరు ఎన్నిసార్లు అడిగినా.. ఎంత ఒత్తిడి చేసినా ఒక్కటే సమాధానం. నాకేమీ తెలియదు. నాకు అసలు సంబంధమే లేదు. ఈ కేసులో కావాలని నన్ను ఇరికించారు.
ఎన్నిసార్లు అడిగినా తనకేమీ తెలియదనే సమాధానం
సాక్షుల బెదిరింపు కేసులో కస్టడీకి తీసుకున్న పోలీసులు
రాత్రి 11 గంటల వరకూ కొనసాగిన విచారణ
కాకినాడ, రాజమహేంద్రవరం, మే 5(ఆంధ్రజ్యోతి): ‘‘మీరు ఎన్నిసార్లు అడిగినా.. ఎంత ఒత్తిడి చేసినా ఒక్కటే సమాధానం. నాకేమీ తెలియదు. నాకు అసలు సంబంధమే లేదు. ఈ కేసులో కావాలని నన్ను ఇరికించారు. అంతకుమించి నేనేమీ చెప్పలేను.’’ ఇదీ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసు విచారణలో ఇచ్చిన సమాధానం. దళిత యువకుడు, కారు డ్రైవర్ వీధి సుబ్రహణ్యం హత్య కేసులో సాక్షులను ప్రలోభపెట్టి, బెదిరించిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబును పోలీసులు మంగళవారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను ఒకరోజు పాటు విచారించనున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు అనంతబాబును కాకినాడ సర్పవరం పోలీసుస్టేషన్ వద్ద ఉన్న రూరల్ క్రైమ్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అక్కడ పోలీసు భద్రత మధ్య ఆయన్ను విచారించారు. కేసు దర్యాప్తు అధికారి, తుని రూరల్ సీఐ చెన్నకేశవరావుతో పాటు ఇద్దరు సీఐలు, ఇతర సిబ్బంది ఈ విచారణలో పాల్గొన్నారు. రెండున్నర గంటలకు ఒకసారి చొప్పున విడతల వారీగా ఈ విచారణ సాగింది.
గతంలో వేసిన 30 ప్రశ్నలకు అదనంగా మరో 20 ప్రశ్నలు జోడించి, మొత్తంగా 50 ప్రశ్నలతో జాబితా సిద్ధం చేశారు. ‘‘సాక్షుల బెదిరింపు, ప్రలోభపెట్టడం అనే ఆలోచన ఎలా వచ్చింది?, ఈ సలహా ఎవరిచ్చారు? ఆ సమయంలో ఎవరెవరితో ఫోన్‌లో మాట్లాడారు?, వైసీపీ నేత కడియాల చిన్నబాబు(ఏ2), కడియాల సతీశ్ (ఏ3), మాగంటి రాంబాబు (ఏ4), చక్కపల్లి శ్రీనివాసరావు (ఏ5)లతో మీకున్న సంబంధం ఏమిటి?, ఇంకా ఎంతమందిని బెదిరించాలని అనుకున్నారు?, ఈ కుట్ర వెనుక ఎవరెవరి పాత్ర ఎంత?, గతనెలలో మిమ్మల్ని పోలీసులు అరెస్టు చేసేందుకు శ్రీరామ్‌నగర్ శంకర్ టవర్స్‌లోని మీ అపార్ట్‌మెంట్‌కు వచ్చినప్పుడు ఎలా తప్పించుకోగలిగారు?, మీకు ముందస్తు సమాచారం ఇచ్చింది ఎవరు? ఆ రోజు అక్కడ దొరికిన రూ.12లక్షలు ఎవరివి? ఎవరి కోసం అంత డబ్బు అక్కడ ఉంచారు?, ఆ డబ్బు ఎక్కడిది?’’... ఇలా అనేక ప్రశ్నలను పోలీసులు సంధించారు. రాత్రి 11 గంటల వరకూ విచారణ కొనసాగింది. ఈ ఒక్కరోజు విచారణకు అనంతబాబు సహకరించపోతే కస్టడీ పొడిగించాలని కోర్టును కోరతామని దర్యాప్తు అధికారి తెలిపారు. డ్రైవర్ హత్యకేసుకు సంబంధించి అనంతబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టులో ఇప్పటికే వాదోపవాదనలు పూర్తయ్యాయి. ఈ కేసులో కోర్టు బుధవారం తీర్పు చెప్పనుంది.