Share News

జాడ లేని అనంతబాబు

ABN , Publish Date - Apr 24 , 2026 | 05:12 AM

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు జాడ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం కాకినాడ నుంచి ఆయన పరారైనట్టు పోలీసులు నిర్ధారించుకుని...

జాడ లేని అనంతబాబు

  • కొనసాగుతున్న పోలీసుల వేట

  • సాక్షులను బెదిరించిన కేసులో పరార్‌

  • తనపై కేసును కొట్టివేయాలంటూ

  • హైకోర్టులో ఎమ్మెల్సీ స్క్వాష్‌ పిటిషన్‌

కాకినాడ, అమరావతి, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు జాడ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం కాకినాడ నుంచి ఆయన పరారైనట్టు పోలీసులు నిర్ధారించుకుని ఉమ్మడి గోదావరి జిల్లాలతోపాటు రాష్ట్రం బయట కూడా జల్లెడ పడుతున్నారు. మరోవైపు సాంకేతిక ఆధారాలతో జాడ పట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. డ్రైవర్‌ హత్య కేసులో బెయిల్‌పై ఉన్న అనంతబాబు ఆ కేసులో సాక్షులను ఇటీవల బెదిరించారు. తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దంటూ వారికి నగదు కూడా ఇచ్చారు. దీనిపై సాక్షులు ఫిర్యాదు చేయడంతో అనంతబాబుపై కేసు నమోదైంది. అరెస్ట్‌ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తుండగా, సమాచారం లీకై ఆయన పారిపోయారు. కాగా, పోలీసులకు చిక్కని అనంతబాబు తన లాయర్లతో మాత్రం నిరంతరం ఫోన్లలో టచ్‌లో ఉంటున్నారు. సాక్షులను ప్రభావితం చేసిన కేసులో తనపై సర్పవరం స్టేషన్‌లో నమోదైన కేసును కొట్టేయాలంటూ అనంతబాబు గురువారం హైకోర్టులో స్వ్కాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కేసు ఆధారంగా తదుపరి చర్యలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని అనంతబాబు తరఫు న్యాయవాది కోరడంతో.. పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరుపుతామని కోర్టు స్పష్టం చేసింది. గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులుగా ఉన్న తమను ఎమ్మెల్సీ అనంతబాబు బెదిరించారని, తప్పుడు సాక్ష్యం చెప్పాలని డబ్బు ఇచ్చేందుకు ప్రయత్నించారని దుర్గా శివప్రసాద్‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా అనంతబాబుపై ఈ నెల 21 సర్పవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అనంతబాబు సహా నలుగురిపై కేసు నమోదు కాగా, వారిలో ఒకరిని మాత్రమే ఇప్పటివరకు పోలీసులు అరెస్టు చేయగలిగారు. కాగా, అనంతబాబును తక్షణం అరెస్ట్‌ చేయాలంటూ ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా వ్యాప్తంగా గురువారం నిరసన ప్రదర్శనలు జరిగాయి. నిందితుడిని మొదటినుంచీ వైసీపీ కాపాడుతూ వస్తోందని దళితసంఘాలు ఆందోళన చేపట్టాయి. పరారీలో ఉన్న అనంతబాబు జాడ వైసీపీ నేతలకు తెలుసని ధ్వజమెత్తాయి.

Updated Date - Apr 24 , 2026 | 05:12 AM