Share News

వివాదంలో ఎమ్మెల్యే శ్రీధర్‌

ABN , Publish Date - Jan 28 , 2026 | 06:40 AM

జనసేన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అరవ శ్రీధర్‌ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఏడాదిన్నరగా తనపై అత్యాచారం చేస్తున్నారంటూ ప్రభుత్వ ఉద్యోగిని ఒకరు వీడియో విడుదల చేశారు.

వివాదంలో ఎమ్మెల్యే శ్రీధర్‌

  • ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు

  • వీడియో విడుదల చేసిన ఉద్యోగిని.. ఆమే నన్ను వేధిస్తోంది: ఎమ్మెల్యే శ్రీధర్‌

  • పోలీసులకూ ఫిర్యాదు చేశాం: ఎమ్మెల్యే తల్లి

రైల్వే కోడూరు, జనవరి 27(ఆంధ్రజ్యోతి): జనసేన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అరవ శ్రీధర్‌ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఏడాదిన్నరగా తనపై అత్యాచారం చేస్తున్నారంటూ ప్రభుత్వ ఉద్యోగిని ఒకరు వీడియో విడుదల చేశారు. అయితే... ఆ మహిళే తన కుమారుడిని వేధిస్తోందంటూ ఎమ్మెల్యే తల్లి అరవ ప్రమీల మీడియాకు తెలిపారు. తిరుపతి జిల్లా రైల్వేకోడూరు ఎమ్మెల్యేగా అరవ శ్రీధర్‌ గెలిచినప్పుడు తాను అభినందిస్తూ ఫేస్‌బుక్‌లో మెసేజ్‌ పెట్టానని... ఆ తర్వాత ఆయన తనతో ఫోన్‌లో మాట్లాడారని సదరు ఉద్యోగిని వీడియోలో పేర్కొన్నారు. 2024 జూలైలో తనను కారులో ఎక్కించుకుని వెళ్లి, రాజంపేట ప్రాంతంలో అత్యాచారం చేశారని ఆరోపించారు. ఆ తర్వాత తనపై అనేకసార్లు అత్యాచారం చేశారని, తీవ్రంగా హింసించేవారని ఆరోపించారు. విడాకులు ఇవ్వాలంటూ తన భర్తను కూడా బెదిరించారని చెప్పారు. ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో... మంగళవారం రాత్రి పొద్దుపోయాక ఎమ్మెల్యే శ్రీధర్‌ ఒక వీడియో విడుదల చేశారు. ‘‘నేను ఎమ్మెల్యే కావడానికి ముందు మూడేళ్లు సర్పంచుగా పని చేశా. నాపై ఎలాంటి ఆరోపణలూ రాలేదు. ఇప్పుడు నాపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. ఫేక్‌ వీడియోలను ప్రచారం చేస్తున్న వారితోపాటు వారి వెనకున్న వారిని చట్టపరంగా ఎదుర్కొంటా. ఆ మహిళ గత ఆరు నెలలుగా నన్ను వేధిస్తుంటే మా అమ్మ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు’’ అని తెలిపారు.


మమ్మల్ని బెదిరించింది: ఎమ్మెల్యే తల్లి

మహిళ ఆరోపణలు సంచలనం సృష్టించడంతో... ఎమ్మెల్యే తల్లి అరవ ప్రమీల మంగళవారం రైల్వే కోడూరులో మీడియాతో మాట్లాడారు. ‘రూ.25 కోట్లు ఇవ్వకుంటే మీ కొడుకు జీవితాన్ని నాశనం చేస్తామని ఆ మహిళ బెదిరించింది. బంధువునంటూ మా ఇంటికి వచ్చి, నా కుమారుడితో పరిచయం పెంచుకుంది. తరచూ ఫోన్‌లో మాట్లాడుతూ వివాహం చేసుకోవాలని ఒత్తిడి పెంచింది. కొందరు వైసీపీ నాయకులు పనిగట్టుకుని ఆమె ద్వారా మమ్మల్ని మానసిక హింసకు గురి చేశారు. ఇటీవల ఆమె మా ఇంటికి వచ్చి గొడవ చేయడంతో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాం. రైల్వే కోడూరు పోలీసులు ఆమెపై ఈనెల 7వ తేదీన కేసు నమోదు చేశారు. ఆమెపై న్యాయ పోరాటం చేస్తాం’’ అని ప్రమీల తెలిపారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఆ ఉద్యోగిని చేసిన ఆరోపణలు అవాస్తమని, అతి త్వరలో ఆమె బాగోతాన్ని సాక్ష్యాధారాలతో సహా బయటపెడతామని జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర తెలిపారు.

సమగ్ర విచారణ: మహిళా కమిషన్‌

రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణలకు సంబంధించి సదరు మహిళతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తీసుకున్నట్లు మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలు తేల్చి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Jan 28 , 2026 | 06:48 AM