Share News

నెల రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తా

ABN , Publish Date - Apr 24 , 2026 | 04:49 AM

గుంటూరు శ్యామలనగర్‌ కాలనీ ప్రజల సమస్యల్ని నెల రోజుల్లో పరిష్కరిస్తానని పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి హామీ ఇచ్చారు. గురువారం సాయంత్రం శ్యామలనగర్‌లో...

నెల రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తా

  • గుంటూరు శ్యామలనగర్‌ ప్రజలకు ఎమ్మెల్యే మాధవి హామీ

  • ‘అక్షరం అండగా-పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమానికి విశేష స్పందన

గుంటూరు, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): గుంటూరు శ్యామలనగర్‌ కాలనీ ప్రజల సమస్యల్ని నెల రోజుల్లో పరిష్కరిస్తానని పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి హామీ ఇచ్చారు. గురువారం సాయంత్రం శ్యామలనగర్‌లో ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన ‘అక్షరం అండగా-పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమంలో పాల్గొన్న కాలనీ వాసులు తాము ఎదుర్కొంటున్న తాగునీరు, రోడ్లు, డ్రెయినేజి, వీధికుక్కలు, విద్యుత్‌ హెచ్చుతగ్గులు, గొలుసు దొంగతనాలు తదితర సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారుల ముందు ఏకరవు పెట్టారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మాధవి ప్రజలు చెప్పిన ప్రతీ సమస్యను నోట్‌ చేసుకున్నట్టు చెప్పారు. వీటిపై తాను నిరంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం అయ్యేలా చూస్తానని తెలిపారు. శునకాల బెడద గురించి తాను అసెంబ్లీలో మాట్లాడానని, వీధికుక్కలకు ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఒక నిర్ధిష్టమైన ప్రదేశం లోనే ఆహారం, నీరు పెట్టాలని స్థానికులకు సూచించారు. గత వైసీపీ పాలనలో కనీసం నడవడానికి రోడ్లు కూడా సరిగా లేవని, వాటికి పరిష్కారం చూపామన్నారు. పారిశుధ్యంపై దృష్టిపెడతామన్నారు. విద్యుత్‌ హెచ్చు, తగ్గుల సమస్యల పరిష్కారానికి త్వరలో రెండు సబ్‌ స్టేషన్లు నిర్మిస్తామన్నారు. తాగునీరు పుష్కలంగా సరఫరా చేయాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. డ్రెయిన్ల క్లీనింగ్‌ ఒక రోజుతో కాకుండా నిరంతరం జరిగేలా చూడాలని సూచించారు. ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమాన్ని ప్రతీ డివిజన్‌లో నిర్వహించాలని, తాను హాజరై ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరిస్తానని చెప్పారు. ప్రజలు పేర్కొన్న సమస్యలపై ఏఎస్పీ రమణమూర్తి, పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ డీఈఈ రమణ, సీపీడీసీఎల్‌ ఏఈ వెంకటరావు ప్రత్యేకంగా స్పందిస్తూ త్వరలో పరిష్కరిస్తామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి డీజీఎం ఎస్‌.రామచంద్రరావు, బ్యూరో ఇన్‌చార్జి జి.భాస్కరరావు, ఎడిషన్‌ ఇన్‌చార్జి ఎస్‌.సాంబశివరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2026 | 04:49 AM