Share News

మీరు దుశ్శాసనులేమో... ఇక్కడ ద్రౌపదులెవరూ లేరు

ABN , Publish Date - Feb 04 , 2026 | 05:12 AM

‘జుట్టు పట్టుకుని ఈడ్చడానికి మీరు దుశ్శాసనులు కావచ్చేమో... ఇక్కడ ద్రౌపదులెవరూ లేరు’ అని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి అన్నారు.

మీరు దుశ్శాసనులేమో... ఇక్కడ ద్రౌపదులెవరూ లేరు

  • జుట్టుపట్టుకొని లాగడానికి అధికారంలోకి వచ్చేవరకూ ఎందుకు?

  • 11 మందితో సభకు రండి తేల్చుకుందాం

  • నేను రెచ్చగొట్టాననడానికి ఆధారాలేవి?

  • మేం పట్టుకొచ్చింది చీపుళ్లు.. రాడ్లు కాదు

  • మహిళలపై ముందు దాడి చేసింది వైసీపీవాళ్లే: ఎమ్మెల్యే గళ్లా మాధవి

గుంటూరు, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): ‘జుట్టు పట్టుకుని ఈడ్చడానికి మీరు దుశ్శాసనులు కావచ్చేమో... ఇక్కడ ద్రౌపదులెవరూ లేరు’ అని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి అన్నారు. సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ శ్రేణుల హెచ్చరికలకు మంగళవారం ఆమె ప్రతిస్పందించారు. పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘సీఎం చంద్రబాబును అంబటి దుర్భాషలాడడం వెనుక వైసీపీ కుట్ర ఉంది. పథకం ప్రకారం శాంతి భద్రతలకు విఘాతం కలిగించి, రివర్స్‌ డ్రామాలకు పాల్పడుతోంది. తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వారం రోజుల్లో అన్ని విషయాలు స్పష్టంగా బయటకు వస్తాయి. సీఎం చంద్రబాబును దూషించి, ఆ తరువాత నేను అనలేదు అంటూ అంబటి మాట మార్చడం సిగ్గుచేటు. కార్యకర్తలను నేను రెచ్చగొట్టానని చెప్పడానికి ఆధారాలు ఎక్కడ ఉన్నాయి? నేను దాడి చేయాలనుకుంటే మీరు టీడీపీ కార్యాలయంపై చేసినట్టు చేయించలేనా? కేంద్ర మంత్రి పెమ్మసాని భార్యను రాజకీయాల్లోకి లాగడం ఎందుకు? ఈ ఘటనకు ఆమెకు ఏం సంబంధం? ఆమె ఎందుకు సమాధానం చెప్పాలి?’ అని ఎమ్మెల్యే నిలదీశారు. అంబటి కుమార్తెను ఉద్దేశించి మాట్లాడుతూ... ‘మహిళలపై దాడి గురించి మాట్లాడుతున్న మీరు... టీడీపీ మహిళా కార్యకర్తపై మీ నాన్న కార్యాలయం వద్ద దాడి జరిగినప్పుడు మీ తండ్రిని ఎందుకు ప్రశ్నించలేదు? మీ నాన్న పవన్‌ కల్యాణ్‌ గురించి అవమానకరంగా మాట్లాడినప్పుడు కులం గుర్తుకు రాలేదా? ఇప్పుడు మాత్రం కులాన్ని ఎందుకు వాడుకుంటున్నారు? మేము మాట్లాడితే రెచ్చగొట్టినట్టా? మీరు మాట్లాడితే ప్రశ్నించడమా?’ అంటూ ఆగ్రహంగా నిలదీశారు.


జక్కంపూడి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ...

‘అధికారంలోకి వచ్చాక జుట్టు పట్టుకుని బయటకు లాగుతాం... అంటూ జక్కంపూడి రాజా మాట్లాడుతున్నారు. ఇది వారి రాజకీయ వైఖరికి నిదర్శనం. అప్పటిదాకా ఎందుకు? ఇప్పుడే అసెంబ్లీకి వచ్చి తేల్చుకోండి. వైసీపీ ఎమ్మెల్యేలకు దమ్ముంటే ఈ నెల 11న 11 మందీ కలిసి అసెంబ్లీకి రావాలి. అక్కడే అన్ని అంశాలు తేల్చుకుందాం. 2029 వరకు వేచిచూడడం ఎందుకు?’ అని గళ్లా సవాల్‌ విసిరారు.

వైసీపీది రివర్స్‌ డ్రామా రాజకీయాలు

‘గత రెండు రోజుల పరిణామాలన్నీ వైసీపీ ఆడుతున్న రివర్స్‌ డ్రామా రాజకీయాలే. ఒకవైపు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ, మరోవైపు బాధితులమని నటించడం వైసీపీకి అలవాటే. మీరు 11 సీట్లకే ఎందుకు పరిమితమయ్యారో ప్రజలకు తెలుసు. మేము చీపుర్లు తీసుకుని వచ్చాం... రాడ్లు కాదు. మా ఇంటి ఆడవాళ్లను తిడితే కోపం రాదా? మా మహిళా కార్యకర్తలపై దాడి మొదలుపెట్టింది వైసీపీనే. మేం చేసింది కేవలం నిరసన మాత్రమే’ అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

మమ్మల్ని అంటే భరించాం.. సీఎంని అంటే ఊరుకోం

‘మమ్మల్ని డమ్మీలు అన్నా స్పందించలేదు. మాపై ఎన్ని విమర్శలు చేసినా భరించాం. కానీ ముఖ్యమంత్రి స్థాయిని తాకితే మాత్రం చూస్తూ ఊరుకోం. గంజాయి, డ్రగ్స్‌కు బానిసలైనవాళ్లతో వైసీపీ సోషల్‌ మీడియా నడుస్తోంది. కొందరు నేతలు నన్ను జుట్టు పట్టుకుని తీసుకొస్తామని మాట్లాడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలను అంబటి కుమార్తె సమర్థిస్తారా? ముందు సానుభూతిని, తర్వాత కులాన్ని, ఆ తర్వాత మతాన్ని ఆయుధాలుగా వాడడం జగన్‌ రాజకీయ నైజం’ అని మాధవి విమర్శించారు.

Updated Date - Feb 04 , 2026 | 05:12 AM