Share News

సైబర్‌ కేటుగాళ్ల వలలో ఎమ్మెల్యే బాలరాజు

ABN , Publish Date - Mar 23 , 2026 | 03:51 AM

ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సైబర్‌ కేటుగాళ్ల వలలో చిక్కుకున్నారు. ఆలస్యంగా గుర్తించిన ఆయన పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సైబర్‌ కేటుగాళ్ల వలలో ఎమ్మెల్యే బాలరాజు

  • ఏపీకే ఫైల్‌తో మెసేజ్‌

  • తెరిచిన వెంటనే ఖాతా ఖాళీ

  • 12 లక్షలు మాయమైనట్లు ఫిర్యాదు

జీలుగుమిల్లి, మార్చి 22(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సైబర్‌ కేటుగాళ్ల వలలో చిక్కుకున్నారు. ఆలస్యంగా గుర్తించిన ఆయన పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల ఆరో తేదీన ఎమ్మెల్యే తన సెల్‌ఫోన్‌కు ఆర్టీఏ చలానా పేరిట వచ్చిన ఓ మెస్సేజ్‌ లింక్‌ను క్లిక్‌ చేశారు. అందులో వివరాలు అసమగ్రంగా ఉండడంతో ఆయన పెద్దగా పట్టించుకోలేదు. అయితే అదే తేదీన జంగారెడ్డిగూడెంలోని ఇండస్‌ ల్యాండ్‌ బ్యాంకులోని తన ఖాతా నుంచి రూ.12 లక్షల నగదు విత్‌డ్రా అయినట్టు ఆయన ఈనెల 20వ తేదీన గుర్తించారు. ఇది సైబర్‌ నేరగాళ్ల పనిగా భావించి జీలుగుమిల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వి.క్రాంతికుమార్‌ తెలిపారు. సీఐ వి.వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - Mar 23 , 2026 | 03:52 AM