నేటి నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల క్రీడా పోటీలు
ABN , Publish Date - Feb 24 , 2026 | 04:47 AM
లెజిస్లేచర్ స్పోర్ట్స్ మీట్ మంగళవారం ప్రారంభం కానుంది. అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం(ఐజీఎంఎస్)లో ఈ పోటీలను ప్రారంభిస్తారు.
విజయవాడలో మూడు రోజులు నిర్వహణ
క్రికెట్‌లో ఆరు జట్లు.. కె ప్టెన్లుగా మంత్రులు
విజయవాడ, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): లెజిస్లేచర్ స్పోర్ట్స్ మీట్ మంగళవారం ప్రారంభం కానుంది. అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం(ఐజీఎంఎస్)లో ఈ పోటీలను ప్రారంభిస్తారు. మూడు రోజులపాటు పోటీలు నిర్వహిస్తారు. ఆ వివరాలను శాప్ చైర్మన్ ఎ.రవినాయుడు, ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్‌రెడ్డి, సుందరపు విజయకుమార్, ఎమ్మెల్సీ కల్యాణచక్రవర్తి సోమవారం ఐజీఎంఎస్ లో వెల్లడించారు. ఈ సందర్భంగా క్రీడల్లో పాల్గొనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధరించే జెర్సీలను ఆవిష్కరించారు. మొత్తం 14 రకాల ఆటల పోటీలను నిర్వహించనుండగా, పాల్గొనేందుకు 156 మంది ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పేర్లు నమోదు చేసుకున్నారు. టగ్ ఆఫ్ వార్, అథ్లెటిక్స్, వాలీబాల్, త్రోబాల్, టెన్నికాయిట్, కబడ్డీ, క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్, పికిల్ బాల్, మ్యూజికల్ చైర్స్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, చెక్, క్యారమ్స్ పోటీలను నిర్వహిస్తారు. బ్యాడ్మింటన్‌కు 60 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. క్రికెట్‌లో ఆరు జట్లు పాల్గొంటాయి. పోటీలను ఐజీఎంఎస్, డీఆర్‌ఆర్ ఇండోర్ స్టేడియంలలో నిర్వహిస్తారు.
కెప్టెన్లు వీరే.. త్రోబాల్‌లో ఒక జట్టుకు మంత్రులు అనిత కెప్టెన్‌గా, సవిత వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. టగ్ ఆఫ్ వార్‌లో ఒక జట్టుకు స్పీకర్ అయ్యన్న, మరో జట్టుకు డిప్యూటీ స్పీకర్ కె.రఘురామ కెప్టెన్‌లుగా వ్యవహరిస్తారు. క్రికెట్‌లో ఆరు జట్లకు మంత్రి అచ్చెన్న, కొల్లు రవీంద్ర, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్, పల్లా శ్రీనివాసరావు కెప్టెన్‌లుగా ఉంటారు. బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి క్రికెట్ వ్యాఖ్యాత వ్యవహరిస్తారు.
జగన్ బౌలింగ్.. లోకేశ్ బ్యాటింగ్ చూడాలని ఉంది: బొజ్జల
ఆటల పోటీల్లో పాల్గొనాలని వైసీపీని ఆహ్వానించామని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి తెలిపారు. వైసీపీకి అసెంబ్లీలో ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు క్రికెట్‌లో ఒక జట్టుగా ఉంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు. జగన్ బౌలింగ్‌కు మంత్రి లోకేశ్ బ్యాటింగ్ చేస్తుంటే చూడాలని ఉందన్నారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి లోకేశ్ ఏదో ఒక రోజున పోటీల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.