చోడవరంలో జపాన్ మ్యాంగో!
ABN , Publish Date - Jun 01 , 2026 | 04:43 AM
మియాజాకీ... ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడిరకాల్లో ఒకటి. జపాన్‌లోని మియాజాకీ నగరం ఈ మామిడికి పుట్టిల్లు. రుచితో పాటు మంచి పోషక విలువలు కలిగిన మియాజాకీ మామిడి ధర జపాన్‌లో..
రెండేళ్లకే ‘మియాజాకీ’ ఫలాలు
అతి ఖరీదైన మామిడి రకాల్లో ఒకటి
మన ప్రాంతమూ సాగుకు అనుకూలం
చోడవరం, మే 31(ఆంధ్రజ్యోతి): మియాజాకీ... ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడిరకాల్లో ఒకటి. జపాన్‌లోని మియాజాకీ నగరం ఈ మామిడికి పుట్టిల్లు. రుచితో పాటు మంచి పోషక విలువలు కలిగిన మియాజాకీ మామిడి ధర జపాన్‌లో కిలో రూ.లక్షన్నర వరకూ ఉంటుందని చెబుతుంటారు. అరుదైన మియాజాకీ మామిడి చెట్లను ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లోనూ అక్కడక్కడా పెంచుతున్నారు. మూడు రోజుల క్రితం విశాఖ నగరంలో ఏర్పాటుచేసిన మ్యాంగో మేళాలో కిలో వెయ్యి రూపాయలకు విక్రయించారు. అనకాపల్లి జిల్లా చోడవరం సమీపంలోని నరసయ్యపేటలో గల పరిటాల నాగేశ్వరరావు వ్యవసాయ క్షేత్రంలో ఈ మియాజాకీ చెట్లు ఉన్నాయి. రెండేళ్ల క్రితం కడియం నుంచి తెచ్చి నాటిన ఈ అరుదైన రకం మామిడి మొక్క ఈ ఏడాది కాపునకు వచ్చింది. చూడడానికి గుండ్రని ఆకారంలో ఎరుపు రంగులో ఉండి పండిన తరువాత ఆపిల్ రంగులోకి మారుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, బీటాకెరోటిన్‌తో పాటు ఫోలిక్ యాసిడ్లు ఉండడంతో ఈ మామిడి పండుకు విపరీతమైన క్రేజ్ అని సమాచారం. మియాజాకీ మామిడి స్థానికంగా కూడా కాపునకు రావడంతో, ఈ ప్రాంతం కూడా సాగుకు అనువైనదిగా భావిస్తున్నారు.
బనానా మ్యాంగో
ఈ తోటలో జపాన్‌కు చెందిన మియాజాకీ మామిడి రకంతో పాటు, థాయ్‌లాండ్‌కు చెందిన బనానా మ్యాంగో కూడా కాపునకు వచ్చింది. ఇది చూడడానికి అరటిపండును పోలి ఉంటుంది. ఈ హైబ్రిడ్ రకం బనానా మ్యాంగోను మెట్రో నగరాల్లో కిలో రూ.200 నుంచి రూ.300 వరకూ విక్రయిస్తున్నారు.