చిన్నారి కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ
ABN , Publish Date - Jun 18 , 2026 | 04:11 AM
కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని, గాలింపు చర్యలు ముమ్మరం చేస్తోందని..
జ్ఞానేశ్వరి కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి అనిత
పాప అదృశ్యమైన ప్రాంతం పరిశీలన
ఆచూకీ కోసం అన్ని వనరులూ వినియోగించాలని ఆదేశం
తుని రూరల్, జూన్ 17(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని, గాలింపు చర్యలు ముమ్మరం చేస్తోందని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. బుధవారం ఆమె గ్రామాన్ని సందర్శించి.. చిన్నారి తల్లిదండ్రులు గణేశ్, భవానీలను పరామర్శించి ఓదార్చారు. పాప ఆచూకీ కోసం ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని, కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్‌బాబుతో కలిసి కుటుంబ సభ్యులతో మాట్లాడిన హోంమంత్రి, ఎవరి మీదైనా అనుమానాలు ఉంటే నిర్భయంగా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. అనంతరం ఎస్పీ జి.బిందుమాధవ్, పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్, స్థానిక పోలీసు అధికారులతో హోంమంత్రి ప్రత్యేకంగా సమావేశమై కేసు పురోగతిపై సమీక్షించారు. కేసులోని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు..
ఆ తర్వాత మీడియాతో హోంమంత్రి మాట్లాడుతూ చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారని తెలిపారు. ‘ఈ కేసుపై నేను రోజూ కాకినాడ ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నాను. ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగిస్తోంది. పాప క్షేమంగా లభించే వరకు గాలింపు చర్యలు కొనసాగుతాయి’ అని తెలిపారు. కాగా, ఈ ఘటనపై ప్రజల్లో ఆందోళన కలిగించేలా వదంతులు, తప్పుడు కథనాలు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వెనుకాడదని హెచ్చరించారు.