పంచాయతీ అధికారుల చేతివాటం
ABN , Publish Date - Sep 19 , 2026 | 11:27 PM
హొళగుంద మేజర్ గ్రామ పంచాయతీ అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారింది.
దుకాణాల వేలంలో లక్షల రూపాయలు వసూళ్లు
సొంత అవసరాలకు ప్రభుత్వ సొమ్ము వాడుకున్న అధికారులు
పట్టించుకోని జిల్లా అధికారులు
హొళగుంద, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): హొళగుంద మేజర్ గ్రామ పంచాయతీ అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారింది. పంచాయతీ దుకాణాల వేలం పాటల ద్వారా వచ్చిన లక్షల రూపాయలను పంచాయతీకి చెందిన కొందరు అధికారులు వసూళ్లు చేసుకుని టెండర్‌దారులకు బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వ సొమ్మును తమ అవసరాలకు వాడుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీకి చెందిన 5 దుకాణాలు 2026-27 నుంచి మూడు సంవత్సరాల కాల పరిమితితో వేలం వేయగా రూ.21,80,889 మొత్తానికి వేలం దక్కించుకున్న ఐదుగురు టెండర్‌దారుల నుంచి రూ.6,75,000 వసూలు చేసినట్లు తెలిపారు. ఆ మొత్తానికి టెండర్‌దారులకు బిల్లులు ఇవ్వకుండా ఐదు నెలలుగా పంచాయతీ కార్యాలయం చుట్టూ తిప్పుకున్నట్లు తెలిపారు. ఎవరైనా టెండర్‌దారులు గట్టిగా ప్రశ్నిస్తే రీ టెండర్ నిర్వహించి మీ దుకాణాన్ని వేరే వారికి ఇస్తామని బెదిరిస్తున్నట్లు ఓ దుకాణదారుడు వాపోతున్నాడు. బిల్లులు ఇవ్వడం లేదని దుకాణదారులు రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లగా, అధికారులు అప్పటికప్పుడు కొందరికి బిల్లులు ఇచ్చి మిగతా వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు పలువురు టెండర్‌దారులు అంటున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి మేజర్ పంచాయతీకి సంబంధించిన రికార్డులు పరిశీలిస్తే లక్షల రూపాయల అవినీతి బయట పడే అవకాశం ఉన్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై స్పెషల్ ఆఫీసర్ చక్రవర్తిని వివరణ కోరగా, వసూళ్లు చేసిన మాట వాస్తవమేనని, ఆ డబ్బును పంచాయతీ సిబ్బందికి జీతాలుగా చెల్లించినట్లు తెలిపారు.