సామాజిక సమానత్వానికి ఆద్యుడు పూలే
ABN , Publish Date - Apr 12 , 2026 | 06:03 AM
దేశంలో విద్య, సామాజిక సమానత్వానికి ఆద్యుడు జ్యోతిబా ఫూలే అని మంత్రులు ప్రశంసించారు. పూలే ఆశయ సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
జయంతి సభలో మంత్రుల నివాళి
బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి
విజయవాడ అర్బన్, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): దేశంలో విద్య, సామాజిక సమానత్వానికి ఆద్యుడు జ్యోతిబా ఫూలే అని మంత్రులు ప్రశంసించారు. పూలే ఆశయ సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా ఫూలే ద్విశతాబ్ది జయంతి వేడుకలను రాష్ట్ర స్థాయిలో శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు ఎస్.సవిత, కె.అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, వర్ల కుమార్ రాజా తదితరులు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ మహిళా సాధికారత, మహిళా విద్యకు పూలే దంపతులు నాంది పలికారని, వారి ఆశయాల వల్లే నేడు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వంటి మహిళలు కీలక పదవుల్లో ఉన్నారని పేర్కొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వందల ఏళ్ల క్రితమే కుల వివక్షకు వ్యతిరేకంగా స్వరమెత్తి, విద్య ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసిన మహనీయుడు పూలే అని కొనియాడారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ దేశంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, ముఖ్యంగా విద్యా, సామాజిక సమానత్వం కోసం పోరాడిన తొలి మహనీయుడు పూలే అన్నారు. మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ఆయన పోరాటం సమాజంలో సమానత్వానికి బాటలు వేసిందన్నారు. అనంతరం సామాజిక సేవా రంగంలో విశేష కృషి చేసిన 11 మందినకి మహాత్మా పూలే రాష్ట్ర స్థాయి పురస్కారాలను అందజేశారు. బీసీ కార్పొరేషన్ చైర్మన్లను సత్కరించారు.