విశ్వసనీయత... ఆ మాట పలకడానికి జగన్ అనర్హుడు: మంత్రి అచ్చెన్నాయుడు
ABN , Publish Date - Apr 05 , 2026 | 05:32 AM
‘పార్లమెంటులో ఎన్నో కీలక అంశాలపై రాని ఏకాభిప్రాయం.. అమరావతికి వచ్చిం ది. కానీ వైసీపీ మాత్రం వ్యతిరేకించింది’ అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
ఓడినా జగన్‌రెడ్డిలో సైకో లక్షణాలు పోలేదు: మంత్రి జనార్దన్‌రెడ్డి
అమరావతి, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): ‘పార్లమెంటులో ఎన్నో కీలక అంశాలపై రాని ఏకాభిప్రాయం.. అమరావతికి వచ్చిం ది. కానీ వైసీపీ మాత్రం వ్యతిరేకించింది’ అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, అనగాని సత్యప్రసాద్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ‘తెలుగు జాతి, అమరావతిపై జగన్‌కి ఎందుకంత కక్ష? అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు... అమరావతికి వ్యతిరేకం కాదన్నారు. అధికారంలోకి రాగానే 3 రాజధానులు అంటూ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక కేవలం 20 నెలల్లో ఆగిపోయిన రాజధాని పనులన్నింటినీ ప్రారంభించాం. విశ్వసనీయత అనే జగన్‌కు ఆ మాట మాట్లాడే నైతిక హక్కు లేదు. రాజధానిపై తడవకో మాట చెప్పే జగన్‌కు విశ్వసనీయత ఏమిటి?’ అంటూ అచ్చెన్న నిగ్గదీశారు. మరో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ, ‘అమరావతే రాజధానిగా ప్రపంచమంతా అంగీకరిస్తున్నా జగన్ మాత్రం వ్యతిరేకిస్తున్నారు. 2024లో జగన్‌ని ప్రజలు ఓడగొట్టినా ఆయనలో సైకో లక్షణాలు మాత్రం పోలేదు. రాష్ట్రంపై నిత్యం విషం చిమ్మడమే జగన్, ఆయన పత్రిక పనిగా పెట్టుకున్నాయి.’ అని విమర్శించారు.