అంబటీ ఖబడ్దార్.. నువ్వు మనిషివేనా?
ABN , Publish Date - Feb 01 , 2026 | 05:20 AM
ముఖ్యమంత్రి చంద్రబాబుపై బండ బూతులతో విరుచుకుపడ్డ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పలువురు మంత్రులు నిప్పులు చెరిగారు.
సహించం, చూస్తూ ఊరుకోం: మంత్రుల హెచ్చరిక
(ఆంధ్రజ్యోతి-న్యూ్‌సనెట్‌వర్క్)
ముఖ్యమంత్రి చంద్రబాబుపై బండ బూతులతో విరుచుకుపడ్డ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పలువురు మంత్రులు నిప్పులు చెరిగారు. ‘‘అంబటీ ఖబడ్దార్.. నువ్వు మనిషివేనా?. వీధి రౌడీ కూడా నీలా నోరు పారేసుకోడు. ఇలాంటి నేతను ప్రజలు తరిమి కొట్టాలి.’’ అని పలువురు మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకు వైసీపీ కుట్ర చేస్తోందేమోనన్న అనుమానాలు వ్యక్తం చేశారు. అదేసమయంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని దుయ్యబట్టారు.
ప్రజలు ఉమ్మేస్తున్నారు: అనిత
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. ముఖ్యమంత్రిని, పోలీసు అధికారులను అసభ్య పదజాలంతో దూషించిన అంబటిపై కచ్చితంగా కేసు నమోదు చేస్తామని చెప్పారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేత పట్టాభి చిన్న పదం వాడినందుకు ఆయన ఇంటిపైనా, టీడీపీ పార్టీ కార్యాలయంపైనా దాడి చేశారని ఆమె గుర్తుచేశారు. కల్తీ నెయ్యి విషయంలో వైసీపీపై రాష్ట్ర ప్రజలు ఉమ్మేస్తున్నారని విమర్శించారు.
నీచం..: అచ్చెన్న
సీఎం చంద్రబాబుపై అంబటి వ్యాఖ్యలు అత్యంత నీచమని, సభ్యసమాజం సిగ్గుపడేలా మాట్లాడటం దారుణమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో మాట్లాడుతూ.. సీఎంపై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదన్నారు.
మనిషివేనా..: సంధ్యారాణి
‘అంబటీ నువ్వు మనిషివా..? జంతువువా..? రాక్షసుడివా..? 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారే. ఇంకా మీకు సిగ్గు లేదా? సీఎం పదవిలో ఉన్న వ్యక్తిపై అలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా? ముఖ్యమంత్రి హోదాను అవమానించేలా మాట్లాడడం ప్రజాస్వామ్యానికే అవమానం. చంద్రబాబుకు బహిరంగ క్షమాపణ చెప్పాలి’ అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి డిమాండ్ చేశారు.
తరిమి కొట్టాలి: కొండపల్లి
సీఎం చంద్రబాబుపై అంబటి చేసిన అప్రజాస్వామిక వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. తక్షణమే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్య కలపడం నిజం కాదా? అని ప్రశ్నించారు. అంబటి వంటి వారిని తరిమి కొట్టాలని ఆయన వ్యాఖ్యానించారు.
లోకేశ్ పిలుపునిస్తే..: సవిత
చంద్రబాబు మాతృమూర్తిని దూషించిన వైసీపీ నేత అంబాటి రాంబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి సవిత డిమాండ్ చేశారు. వైసీపీ నేతలకు మహిళలంటే గౌరవం లేదన్నారు. మంత్రి నారా లోకేశ్ ఒక్క పిలుపునిస్తే వైసీపీ నాయకులు ఒక్కరు కూడా బయటికి రాలేరని మంత్రి హెచ్చరించారు. వైసీపీని ఎన్నికల సంఘం బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు.
వీధి రౌడీ: అనగాని
సీఎం చంద్రబాబును అత్యంత దారుణంగా దూషించిన అంబటి రాంబాబును కఠినంగా శిక్షించాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు. అంబటి వీధి రౌడీ కన్నా నీచంగా మాట్లాడారని, ఆయన సమాజానికి పట్టిన చీడపురుగు అని ధ్వజమెత్తారు. అంబటితోపాటు ఆయన్ను సమర్ధించే వైసీపీ నేతలకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదన్నారు.
హేయం: సత్యకుమార్
సీఎం చంద్రబాబుపై అంబటి చేసిన వ్యాఖ్యలను మంత్రి సత్యకుమార్ తీవ్రంగా ఖండించారు. నిత్యం అహం భావంతో వ్యవహరించే అంబటి రాంబాబు సీఎం చంద్రబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమని అన్నారు.