Share News

తలపడిన మంత్రులు!

ABN , Publish Date - Feb 26 , 2026 | 05:06 AM

అసెంబ్లీలో ప్రతిపక్షంతో అధికారపక్షం తలపడుతుంది. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో మంత్రులతో మంత్రులు తలపడ్డారు.

తలపడిన మంత్రులు!

  • రసవత్తరంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆటల పోటీలు

  • పురుషుల టీంలో క్రికెట్‌ ఆడిన గ్రీష్మ, సవిత

  • నేటితో పోటీల ముగింపు

విజయవాడ, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో ప్రతిపక్షంతో అధికారపక్షం తలపడుతుంది. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో మంత్రులతో మంత్రులు తలపడ్డారు. ఒకరిపై ఒకరు విజయం సాధించడానికి పట్టుదలను ప్రదర్శించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆటలపోటీలు బుధవారం రసవత్తరంగా సాగాయి. క్రికెట్‌, టెన్నికాయిట్‌, త్రోబాల్‌ పోటీల్లో మంత్రులతో మంత్రులు తలపడ్డారు. మంత్రి సవిత, ఎమ్మెల్సీ గ్రీష్మ పురుషుల క్రికెట్‌ జట్టులో కాసేపు ఆడి ఆలరించారు. గురువారం సాయంత్రంతో ఈ ఆటల పోటీలు ముగుస్తాయి.

సత్యకుమార్‌ బంతి - పల్లా ఫోర్‌

మంత్రి సత్యకుమార్‌, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు జట్ల మధ్య క్రికెట్‌ తొలి మ్యాచ్‌ జరిగింది. సత్యకుమార్‌ జట్టు బౌలింగ్‌ చేసింది. మంత్రి వేసిన బాల్‌ను పల్లా ఫోర్‌ కొట్టడంతో ప్రాంగణంలో కూర్చున్న టీడీపీ ఎమ్మెల్యేలు తమ కెప్టెన్‌ (టీడీపీ అధ్యక్షుడు) ఫోర్‌ కొట్టాడంటూ కేరింతలు కొట్టారు. మైక్‌లో పెద్దగా అరుపులు, కేకలు వేశారు. పల్లా జట్టు పది ఓవర్లకు 69 పరుగులు చేసింది. సత్యకుమార్‌ జట్టు 70 పరుగులు చేసి విజయం సాధించింది.

‘కావలి’ కేకలు.. నవ్వుల పూలు!

ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ సందడి స్టేడియంలో ఎక్కువగా కనిపించింది. సత్యకుమార్‌ , పల్లా శ్రీనివాసరావు జట్ల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ను తిలకిస్తూ వ్యాఖ్యానం చేశారు. మైకులో జై బాలయ్య అంటూ కేకలు వేశారు. పల్లా జట్టులో సభ్యురాలిగా క్రికెట్‌ ఆడారు. ఉత్తరాంధ్ర యాసలో వ్యాఖ్యానం చేసి స్టేడియంలో నవ్వులు పూయించారు. నువ్వు పాడు గజాలా... రవితేజ చిత్రంలోని డైలాగ్‌ ఇది. ఇదే డైలాగ్‌తో కావలి గ్రీష్మ నవ్వులు కురిపించారు. క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు తోటి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో గ్రౌండ్‌లో కూర్చున్న ఆమె ‘పాటలు పెట్టు గజాలా... ముందు బాలయ్య పాటలు పెట్టు. తర్వాత పవన్‌ పాటలు పెట్టు’ అని సౌండ్‌ సిస్టం ఆపరేటర్‌ను ఉద్దేశించి అనడంతో నవ్వుల పూలు విరిశాయి.


పోటాపోటీగా వ్యాఖ్యానాలు

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వ్యాఖ్యానాలు సరద సరదాగా సాగాయి. మంత్రి కొల్లు రవీంద్ర స్టేడియంలోకి వస్తుండగా ఆయనకు వ్యాఖ్యాతలు స్వాగతం పలికారు. ఎమ్మెల్యేలు విజయకుమార్‌, రాధాకృష్ణ, బొజ్జల సుధీర్‌రెడ్డి పోటీపడి వ్యాఖ్యానాలు చేశారు.

కటౌట్‌ చూసి కొన్ని నమ్మాలి డూడ్‌!

క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు మ్యాచ్‌ ఫిక్సింగ్‌లు జరుగుతున్నాయని ఎమ్మెల్యే విజయకుమార్‌ వ్యాఖ్యానించారు. దీనికి మంత్రి కొల్లు రవీంద్ర తాను అలా కనపడుతున్నానా అని కౌంటర్‌ వేశారు. డిప్యూటీ స్పీకర్‌ ఈ విషయాన్ని తేల్చాలన్నారు. అప్పుడు కటౌట్‌ చూసి కొన్నికొన్ని నమ్మాలి డూడ్‌ అనడంతో అంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు.

త్రోబాల్‌లో హోం విజయం

త్రోబాల్‌ పోటీల్లో మంత్రులు అనిత, గుమ్మడి సంధ్యారాణి జట్ల మధ్య ఆట ఉత్కంఠగా సాగింది. చివరికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి జట్టుపై హోంమంత్రి అనిత జట్టు ఏడు పాయింట్ల తేడాతో విజయం సాధించింది.

Updated Date - Feb 26 , 2026 | 05:07 AM