వ్యక్తిత్వ వికాస కేంద్రాలుగా జైళ్లు!
ABN , Publish Date - Feb 24 , 2026 | 05:33 AM
జైళ్లలో ఖైదీల సంస్కరణలకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు.
ప్రిజన్స్, కరెక్షనల్ సర్వీసెస్ బిల్లుకు ఆమోదం
అమరావతి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): జైళ్లలో ఖైదీల సంస్కరణలకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సోమవారం అసెంబ్లీలో ఏపీ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ బిల్లు-2026ను ఆమె ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన చట్టం మేరకు రాష్ట్రంలో కూడా సంస్కరణలు అమలు చేసేందుకు ఈ బిల్లును తెచ్చామన్నారు. ఖైదీలు జైలులో ఉండి చదువుకునేలా అవకాశాలు మెరుగుపరుస్తున్నామని తెలిపారు. వారిలో పరివర్తన తీసుకురావడం కోసం చట్టంలో మార్పులు తేవాల్సి వచ్చిందన్నారు. మహిళా ఖైదీల పిల్లల కోసం జైళ్లలో అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
ఖైదీల నేరచరిత్ర, ప్రవర్తన ఆధారంగా కేటగిరీలుగా విభజిస్తామన్నారు. వారిలో మానసిక పరివర్తన తెచ్చేలా ఓపెన్ ఎయిర్ జైళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఖైదీలు వ్యవసాయంతోపాటు ఇతర వృత్తులు నిర్వహించేలా చర్యలు చేపడతామన్నారు. జైళ్లను వ్యక్తిత్వ వికాస కేంద్రాలుగా మారుస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జైళ్ల సామర్థ్యం 7 వేల మంది అయితే, ప్రస్తుతం అన్ని జైళ్లలో 6,900 మంది మాత్రమే ఉన్నారన్నారు. ఎమ్మెల్యేలు కూన రవికుమార్, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఈ సందర్భంగా జైళ్ల పరిస్థితి విషయంలో తమ దృష్టకి వచ్చిన అంశాలను మంత్రి అనిత్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ బిల్లు-2026ను సభ ఆమోదించింది.