Share News

విశాఖ-చెన్నై కారిడార్‌లో రూ.1.2లక్షల కోట్ల పెట్టుబడులు: మంత్రి భరత్‌

ABN , Publish Date - Mar 05 , 2026 | 04:52 AM

విశాఖపట్నం - చెన్నై కారిడార్‌లో రూ.1,27,931 కోట్ల పెట్టుబడులు రానున్నాయని మంత్రి టీజీ భరత్‌ తెలిపారు. వీటి ద్వారా 1,38,498 ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు.

విశాఖ-చెన్నై కారిడార్‌లో రూ.1.2లక్షల కోట్ల పెట్టుబడులు: మంత్రి భరత్‌

అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం - చెన్నై కారిడార్‌లో రూ.1,27,931 కోట్ల పెట్టుబడులు రానున్నాయని మంత్రి టీజీ భరత్‌ తెలిపారు. వీటి ద్వారా 1,38,498 ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఇవిగాకుండా విశాఖ పెట్టుబడుల సదస్సు ఒప్పందాల మేరకు మరో రూ. 99,747 కోట్ల పెట్టుబడులు రానున్నాయని, వీటి ద్వారా మరో 2,13,382 ఉద్యోగాలు వస్తాయని మంత్రి వివరించారు.

వైసీపీ హయాంలో 913 పెద్ద కంపెనీలు వెళ్లిపోయాయి

గత వైసీపీ ప్రభుత్వంలో 913 పెద్ద కంపెనీలు తరలి వెళ్లిపొయ్యాయని పరిశ్రమల మంత్రి టీజీ భరత్‌ వెల్లడించారు. బుధవారం అసెంబ్లీల్లో పరిశ్రమలకు శాఖకు సంబంధించి రూ.4,444 కోట్ల బడ్జెట్‌ ఆమోదించాలని కోరుతూ ప్రతిపాదించారు. ‘2014-19 మధ్యలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం 1,020 కంపెనీలతో పెట్టుబడులు పెట్టిస్తే, వైసీపీ ప్రభుత్వం 2019-24 మధ్య 913 కంపెనీలను రాష్ట్రా నుంచి వెళ్లగొట్టింది. ఈ విషయాన్ని ఆర్బీఐ తన నివేదిక ద్వారా వెల్లడించింది. కూటమి ప్రభుత్వం 18 నెలల వ్యవధిలో 20 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించింది’ అని భరత్‌ తెలిపారు. పెట్టుబడులపై ఎమ్మెల్యేలు ప్రశాంతి రెడ్డి, లోకం మాధవి, ఎన్‌.ఈశ్వరరావు మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో స్కిల్‌ డెవల్‌పమెంట్‌కు ప్రాధాన్యమివ్వాలి. పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు కల్పించాలి. నెల్లిమర్ల, ఎచ్చెర్ల నియోజకవరర్గాల్లో ఉన్న ఫార్మా కంపెనీల్లో స్థానిక ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు’ అని పేర్కొన్నారు.

Updated Date - Mar 05 , 2026 | 04:52 AM