ఎస్సీ, ఎస్టీలకు 2 వేలకోట్ల సబ్సిడీలు
ABN , Publish Date - Feb 27 , 2026 | 04:23 AM
ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీ రూపంలో వివిధ కేటగిరిల్లో రూ.2 వేల కోట్లు అందించామని, ఎంఎస్ఎంఈలకు రూ.270 కోట్లు ఇచ్చామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ వెల్లడించారు.
ఎంఎస్ఎంఈలకు రూ.270 కోట్లు
పరిశ్రమలు, ఎంఎస్ఎంఈల ఏర్పాటులో ఎస్సీ, ఎస్టీలకు అత్యంత ప్రాధాన్యం
1274 కోట్ల పెట్టుబడులకు అవకాశం.. 17 వేలమందికి ఉపాధి అవకాశాలు
ల్యాండ్ రిబేట్ 25 నుంచి 50 లక్షలకు పెంపు
100 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తాం
గత ప్రభుత్వం కంటే మిన్నగా ప్రోత్సాహకాలు.. అసెంబ్లీలో టీజీ భరత్
అమరావతి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీ రూపంలో వివిధ కేటగిరిల్లో రూ.2 వేల కోట్లు అందించామని, ఎంఎస్ఎంఈలకు రూ.270 కోట్లు ఇచ్చామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.2 వేలకోట్లు ఇవ్వగా, కూటమి ప్రభుత్వం 20 నెలల్లో ఈ మేరకు ఇచ్చామని, రాబోయే మూడేళ్లలో మరింత సబ్సిడీ ఇస్తామని అన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు మరిన్ని అవకాశాలు కల్పించాలని, నూతన పారిశ్రామిక విధానంలో వారికి కల్పించిన అవకాశాలను తెలియజేయాలని ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, విజయచంద్ర, కొండ్రు మురళి అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. రాష్ట్రంలో వివిధ స్థాయిల్లో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు రూ.1274 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం కల్పించామని టీజీ భరత్ తెలిపారు. మొత్తం 51 ప్రాంతాల్లో పరిశ్రమలు పెడుతున్నారని, 17 వేలమందికి ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు. వారికి ల్యాండ్ రిబేట్ కింద రూ.37 కోట్లు కేటాయించామన్నారు. గత ప్రభుత్వం 2019-24 మధ్యలో రూ.1005 కోట్లు కేటాయించగా, కూటమి ప్రభుత్వం 20 నెలల్లో రూ.751 కోట్లు అందించిందని తెలిపారు. వైసీపీ సర్కారు ఐదేళ్లలో 470 ఎకరాలు కేటాయిస్తే, కూటమి ప్రభుత్వం 262 ఎకరాలు కేటాయించిందని చెప్పారు. దీంతో పాటు ఎమ్మెల్యేల విన్నపం మేరకు ల్యాండ్ రిబేట్‌ను రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు, ఎంఎ్‌సఎంఈల ఏర్పాటులో ఎస్సీ, ఎస్టీలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెనాల్టీలు లేకుండా ప్రాజెక్టు నిర్మాణానికి సమయాన్ని పొడిగించామన్నారు. ‘‘ఎస్సీ, ఎస్టీలను ప్రోత్సహించేందుకు సీఎం చంద్రబాబు ఎస్ర్కో అకౌంట్ తీసుకురావాలని చూస్తున్నారు. దీనిపై ప్రత్యేక చట్టం చేసే ఆలోచనలో ఉన్నారు. దీని ద్వారా సబ్సిడీ, ఇతర నిధులు ఎస్సీ, ఎస్టీల ఖాతాల్లో నేరుగా పడేలా ఏర్పాట్లు చేస్తున్నాం. వైసీపీ పాలనలో సబ్సిడీలు పెండింగ్‌లో పెట్టారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హాబ్ ద్వారా ఎస్సీ, ఎస్టీలకు మెంటరింగ్ సహకారం అందిస్తున్నాం. పరిశ్రమలకు టెండర్లలో 4 శాతం టెండరింగ్ సంబంధించి వెసులుబాటు కల్పించాం. కేంద్ర ప్రభుత్వ నిధులకు సంబంధించి రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తాం. దీనిద్వారా 5 వేలమంది ఎస్సీ, ఎస్టీలకు మేలు జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఏపీ ఇండస్ట్రియల్ డెవల్‌పమెంట్ పాలసీ, ఏపీ ఎంఎస్ఎంఈ వ్యవస్థాపక అభివృద్ధి విధానం, ఏపీ ఫుడ్ పాసెసింగ్ పాలసీ వంటివి 25 పాలసీలు తీసుకువచ్చాం. గత ప్రభుత్వంలో పాలసీలు ఇచ్చారు కానీ, మార్గదర్శకాలు ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వంలో పాలసీలతో పాటు మార్గదర్శకాలను విడుదల చేశాం. సింగిల్ డెస్క్ పోర్టల్‌లో ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి అవకాశాలు ఇచ్చారు, ఎంత శాతం రిజర్వేషన్లు ఇచ్చారన్న వివరాలు ఉంటాయి. క్యాపిటల్ సబ్సిడీలో 45 శాతం, 25 శాతం జనరల్ కేటగిరిలో సబ్సిడీ ఇచ్చాం. టెక్నాలజీ అప్‌డేట్, పరిశ్రమ విస్తరణకు 40 శాతం వరకూ ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీ అందిస్తున్నాం. ట్రాన్స్‌ఫోర్ట్ సర్వీసెస్ జనరల్ కేటగిరికి, ఎస్సీ, ఎస్టీలకు చాలా తేడా ఉంది. ల్యాండ్‌కు సంబంధించి 75 శాతం రిబేట్ ఇస్తున్నాం’’ అని మంత్రి అన్నారు.