హస్త కళాకారులకు 365 రోజుల ఉపాధే లక్ష్యం: మంత్రి సవిత
ABN , Publish Date - May 21 , 2026 | 04:57 AM
రాష్ట్రంలోని హస్తకళాకారులకు ఏడాదిలో 365 రోజులూ ఉపాధి కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు.
తాడేపల్లి, మే 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని హస్తకళాకారులకు ఏడాదిలో 365 రోజులూ ఉపాధి కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. లేపాక్షి షోరూమ్‌లు హస్తకళల విక్రయాలపై గుంటూరు జిల్లా కొలనుకొండలోని క్యాంప్ కార్యాలయంలో.. ఆంధ్రప్రదేశ్ హస్త క్రాఫ్ట్స్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (ఏపీహెచ్‌డీసీ) అధికారులతో బుధవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నూతన లేపాక్షి షోరూమ్‌ల ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న షోరూమ్‌లను వినియోగదారులను ఆకట్టుకునేలా అభివృద్ధి చేసే అంశాలపై మంత్రి సవితకు లేపాక్షి ఎండీ విశ్వ వివరించారు. మరమ్మతులు పూర్తి చేసుకున్న ఢిల్లీ, కాకినాడ లేపాక్షి షోరూమ్‌లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. మంత్రి మాట్లాడుతూ... ఈ-కామర్స్, సోషల్ మీడియా వేదికగా లేపాక్షి కళారూపాలను వినియోగదారుల ఇళ్లకే డోర్ డెలివరీ చేయనున్నామని చెప్పారు. కేంద్ర విమానయాన శాఖ అంగీకారం తెలిపినందున రాజమండ్రి ఎయిర్‌పోర్టులో నూతన షోరూమ్ ఏర్పాటుకు త్వరగా చర్యలు తీసుకోవాలన్నారు.