Share News

జగన్‌కు ప్రాజెక్టులపై మాట్లాడే అర్హతలేదు: మంత్రి సవిత

ABN , Publish Date - Mar 03 , 2026 | 04:20 AM

వైఎస్‌ జగన్‌కు రెండు తెలుగు రాష్ట్రాల సాగు, తాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే అర్హతలేదని మంత్రి సవిత అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని టీడీపీ కార్యాలయంలో...

జగన్‌కు ప్రాజెక్టులపై మాట్లాడే అర్హతలేదు: మంత్రి సవిత

పెనుకొండ టౌన్‌, మార్చి 2(ఆంధ్రజ్యోతి): వైఎస్‌ జగన్‌కు రెండు తెలుగు రాష్ట్రాల సాగు, తాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే అర్హతలేదని మంత్రి సవిత అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘వైసీపీ పాలనలో ఒక్క సాగునీటి ప్రాజెక్టునైనా పూర్తి చేశారా? 2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం ప్రాజెక్టుల కోసం రూ.12,500 కోట్లు ఖర్చు చేసింది. కూటమి పాలన మొదలయ్యాక హంద్రీ-నీవా పథకం కింద 750 కి.మీ. సాగునీటి కాలువలు తవ్వాం. నీటిని మడకశిర, కుప్పం వరకూ తీసుకెళ్లాం. 19 నియోజకవర్గాల మీదుగా నీటిని తీసుకెళ్లి 423 చెరువులకు నీరు అందించాం. అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి, ప్రతి ఎకరాకీ నీరు అందిస్తాం. బీసీలకు వజ్రాయుధం చదువే. టీడీపీ ఎల్లప్పుడూ బీసీలకు అండగా ఉంటుంది. ప్రతి జిల్లాకు ఒక మెగా డీఎస్సీ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేశాం. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి, జగన్‌ శవ రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి గురించి ఏం ప్రశ్నించినా సమాధానం చెప్పడానికి మేం సిద్ధంగా ఉన్నాం. అసెంబ్లీకి రారు. కౌన్సిల్‌కు మాత్రమే వచ్చి ప్రశ్నలు వేస్తారు. సమాధానం వినకుండా బాయ్‌కాట్‌ చేసి వెళ్లిపోతారు’ అని మంత్రి సవిత విమర్శించారు.

Updated Date - Mar 03 , 2026 | 04:20 AM