పేద కిడ్నీ రోగులకు ఉచిత డయాలసిస్
ABN , Publish Date - Feb 26 , 2026 | 04:35 AM
పేద కిడ్నీ రోగులకు ప్రభుత్వం ఉచితంగా డయాలసిస్ చేస్తోందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు.
ఒక్కో రోగికి ఏటా రూ.86వేలు ఖర్చు చేస్తున్నాం. వైద్య మంత్రి
అమరావతి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): పేద కిడ్నీ రోగులకు ప్రభుత్వం ఉచితంగా డయాలసిస్ చేస్తోందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. శాసనమండలిలో బుధవారం టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ.. 21,504 మంది కిడ్నీ రోగులు ఉచితంగా డయాలసిస్ సేవలు పొందుతున్నారని తెలిపారు. గత 20 నెలల్లో సెకండరీ ఆసుపత్రుల్లో కొత్తగా 14 డయాలసిస్ కేంద్రాలు ప్రారంభించామని, త్వరలో మరో 11 కేంద్రాలు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఒక్కో రోగికి ఉచిత డయాలసిస్ సేవలకు ప్రభుత్వం ఏటా రూ.86వేలు ఖర్చు చేస్తోందన్నారు. కిడ్నీ రోగులకు పెన్షన్‌తో పాటు మందులు కూడా ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. అతిసార వ్యాధిపై వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ మంచినీరు కలుషితం కాకుండా, డయేరియా కేసులు ప్రబలకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ మంచినీటి పథకాల నిర్వహణ లోపాలను గుర్తించి, చర్యలు తీసుకోవాలని కోరగా, మండలి చైర్మన్ మాట్లాడుతూ పైపులైన్ల లికేజీలను అరికట్టాలని సూచించారు.