చంద్రికకు వైద్య సేవలు అందించండి
ABN , Publish Date - Jul 05 , 2026 | 04:55 AM
అన్నమయ్య జిల్లా ములకలచెరువుకు చెందిన చిన్నారిని అంతుచిక్కని వ్యాధి కబళిస్తోందంటూ శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘చిట్టి తల్లిని కాపాడరూ’ శీర్షికతో కథనం..
అధికారులకు మంత్రి సత్యకుమార్ ఆదేశం
చిన్నారిని పరీక్షించిన డీఎంహెచ్‌వో
బాలిక కుటుంబానికి అండగా నిలుస్తున్న దాతలు
ములకలచెరువు, జూలై 4(ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా ములకలచెరువుకు చెందిన చిన్నారిని అంతుచిక్కని వ్యాధి కబళిస్తోందంటూ శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘చిట్టి తల్లిని కాపాడరూ’ శీర్షికతో కథనం ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం తక్షణం స్పందించింది. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చంద్రికకు తక్షణ వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌వో లక్ష్మీనరసయ్యను ఫోన్‌లో ఆదేశించారు. డీఎంహెచ్‌వోతో పాటు జిల్లా పోగ్రాం ఆఫీసర్ రమేశ్‌బాబు, మదనపల్లె జిల్లా ఆస్పత్రి చిన్నపిల్లల వైద్య నిపుణులు బాలసుబ్రహ్మణ్యం తదితరులు శనివారం ములకలచెరువుకు చేరుకుని చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు కుటుంబ వైద్య చరిత్ర ఆరా తీశారు. ఆమె మేనమామ కుమారులు కూడా ఇదే తరహా వ్యాధితో బాధపడి మరణించినట్టు గుర్తించారు. చంద్రికకు ప్రత్యేక వైద్య పరీక్షలు, వ్యాధి నిర్ధారణ కోసం ఆదివారం తిరుపతి రుయాస్పత్రికి వెళ్లనున్నారు. ఆదివారం ఉదయం ఆరోగ్య సిబ్బందిని వారికి తోడుగా పంపి అవసరమైన వైద్య సేవలు అందేలా చూడాలని స్థానిక వైద్యాధికారిణి రేష్మాబేగంను డీఎంహెచ్‌వో ఆదేశించారు. కాగా ‘ఆంధ్రజ్యోతి’ కథనం పలువురిని కదిలించింది. ములకలచెరువు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి నవీన్‌కుమార్‌రెడ్డి, ఎల్‌డీసీ అరవింద్, సూపర్‌వైజర్ బాలాజీ, సిబ్బంది రాజు, సునీల్, రహీమ్ తదితరులు రూ.30వేలు చంద్రిక తల్లి విజయమ్మకు అందజేశారు. అలాగే మండల వ్యవసాయశాఖాధికారిణి స్రవంతి రూ.10 వేలు అందజేశారు.