ఆటవికంగా ఐదేళ్ల పాలన
ABN , Publish Date - May 22 , 2026 | 06:00 AM
‘తన ఐదేళ్ల పాలనను ఆటవిక పాలనకు ప్రతీకగా మార్చిన మాజీ సీఎం జగన్‌ను రాష్ట్ర ప్రజలు ఎల్లకాలం గుర్తుంచుకుంటారు’ అని మంత్రి సత్యకుమార్ అన్నారు.
వైఎస్ శవం సాక్షిగా పదవి కోసం బేరాలు
నేర చరిత్ర కుటుంబం నుంచి జగన్ రాజకీయాల్లోకి వచ్చాడు
తనకు అందనంత ఎత్తునున్న వారిపై ఉమ్మితే అది తనపైనే పడుతుంది: మంత్రి సత్యకుమార్
అమరావతి, మే 21(ఆంధ్రజ్యోతి): ‘తన ఐదేళ్ల పాలనను ఆటవిక పాలనకు ప్రతీకగా మార్చిన మాజీ సీఎం జగన్‌ను రాష్ట్ర ప్రజలు ఎల్లకాలం గుర్తుంచుకుంటారు’ అని మంత్రి సత్యకుమార్ అన్నారు. గురువారం ప్రెస్ మీట్‌లో జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ధ్వజమెత్తారు. ‘తన ఆటవిక పాలనను ప్రజలు మరిచిపోతారేమోననే భయంతో నెలకోసారి బెంగళూరు నుంచి వచ్చి తాడేపల్లి మహల్‌లో పత్రికా సమావేశాలు పెట్టనవరం లేదు. నేర చరిత్ర గల కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన జగన్‌కు విలువలతో కూడిన రాజకీయాలపై మాట్లాడే నైతిక హక్కు ఏ మాత్రం లేదు. తాత రాజారెడ్డి, తండ్రి రాజశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డిల ఆలోచనలు, వ్యవహార సరళి రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలుసు. జగన్ పత్రికా సమావేశంలో పూర్తి ఆత్మరక్షణ ధోరణిలో ఎదుటివారిపై దాడి చేసేలా విఫలయత్నం చేశారు. తనకు అందని ఎత్తులో ఉన్న వారిపై ఉమ్మి వేయాలని చూస్తే అది తనపైనే పడుతుందన్న వాస్తవాన్ని జగన్ గ్రహించాలి. తన తండ్రి వైఎ్‌సఆర్ శవం సాక్షిగా ముఖ్యమంత్రి పదవి కోసం జగన్ బేరసారాలు జరిపిన వాస్తవం ప్రజలకు తెలుసు. తండ్రి మరణం పట్ల అనుమానాలుంటే ఐదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు నివృత్తి చేసుకోలేదు? తన తాత హత్యకు కారకులైన వారిని ఉపేక్షించి వదిలేయడం తన మంచితనానికి నిదర్శనంగా జగన్‌రెడ్డి చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. వివేకానందరెడ్డి హత్యకు కారకులైన కుట్రదారులు, హంతకులను కాపాడానికి విశ్వప్రయత్నాలు చేశారు. ఇది కూడా ఆయన మంచితనానికి నిదర్శనమా? నూతన వైద్య కళాశాలల నిర్మాణం, నాడు - నేడు పనులకు సంబంధించి నిర్దేశించిన వ్యయం లక్ష్యాల్లో 15 శాతం మాత్రమే ఖర్చు చేసిన మాజీ సీఎం... కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం కుటిలత్వం’ అని మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు.