Share News

జే బ్రాండ్స్‌ వల్లే రోగులు పెరిగారు

ABN , Publish Date - Jun 08 , 2026 | 05:09 AM

గత వైసీపీ హయాంలో సరఫరా చేసిన జే బ్రాండ్ల నకిలీ మద్యం కారణంగానే రాష్ట్రంలో రోగులు పెరిగారని వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ విమర్శించారు.

జే బ్రాండ్స్‌ వల్లే రోగులు పెరిగారు

  • జగన్‌, కేతిరెడ్డి ముక్కు నేలకు రాయాలి: మంత్రి సత్యకుమార్‌

తాడిమర్రి, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ హయాంలో సరఫరా చేసిన జే బ్రాండ్ల నకిలీ మద్యం కారణంగానే రాష్ట్రంలో రోగులు పెరిగారని వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ విమర్శించారు. ఎవరి హయాంలో నకిలీ మద్యం తాగడం మూలంగా అధిక శాతం ప్రజలు కిడ్నీ, షుగర్‌, థైరాయిడ్‌, బీపీలాంటి రోగాల బారిన పడ్డారో చర్చకు సిద్ధమా అని మాజీ సీఎం జగన్‌కు సవాల్‌ విసిరారు. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం పిన్నదరి గ్రామంలో ఆదివారం ఆయన రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఆరోగ్యశ్రీకి రూ.9వేల కోట్లు ఖర్చు చేస్తే కూటమి అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రూ.7 వేలకోట్లు వెచ్చించింది. అధిక శాతం మంది రోగాల బారిన పడడానికి వైసీపీ హయాంలో సరఫరా చేసిన నకిలీ మద్యమే కారణం. నకిలీ మద్యాన్ని అరికట్టలేకపోయిన మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డివెంకటరామిరెడ్డి.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి. జే బ్రాండ్స్‌ మూలంగానే రాష్ట్రంలో మూడు రెట్లు రోగులు పెరిగారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని మా ప్రభుత్వం నిర్వీర్యం చేయలేదు. ఎన్టీఆర్‌ వైద్యసేవ పేరుతో అధికంగా నిధులు ఖర్చు చేశాం. గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన రూ.2500 కోట్ల బకాయిలను కూడా కూటమి ప్రభుత్వమే చెల్లిస్తోంది’ అని అన్నారు.

Updated Date - Jun 08 , 2026 | 05:09 AM