పోషకాహారంతోనే చిన్నారులకు భవిష్యత్
ABN , Publish Date - Apr 10 , 2026 | 03:51 AM
గర్భధారణ సమయంలో తల్లి తీసుకునే పౌష్టికాహారం.. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యకరమైన పెరుగుదలకు ఎంతగానో దోహదపడుతుందని, పోషకాహారంతోనే చిన్నారులకు ఉజ్వల ...
మహిళా, శిశు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
55,766 కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన
‘పోషణ పక్వాడ’ ప్రారంభ సభలో మంత్రి సంధ్యారాణి
విజయవాడ, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): గర్భధారణ సమయంలో తల్లి తీసుకునే పౌష్టికాహారం.. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యకరమైన పెరుగుదలకు ఎంతగానో దోహదపడుతుందని, పోషకాహారంతోనే చిన్నారులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఈ నెల 9 నుంచి 23 వరకు జరిగే ‘పోషణ పక్వాడ’ కార్యక్రమాన్ని గురువారం విజయవాడలోని రైతు శిక్షణ కేంద్రంలో మంత్రి సంధ్యారాణి జ్యోతి వెలించి ప్రారంభించారు. అనంతరం పోషణ పక్వాడ అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గర్భిణుల నుంచి రెండేళ్లలోపు చిన్నారులకు పోషకాహారం, ఆరోగ్యం, విద్యా విషయాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన పోషకాహారంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి గర్భిణి, బాలింత, చిన్నారికి సరైన పోషకాహారం అందేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. గ్రామీణ, గిరిజన ప్రాంత ప్రజలకు పోషకాహారంపై చైతన్యం కల్పించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలోని 55,766 అంగన్‌వాడీ కేంద్రాల్లో టీవీలు, ఆటవస్తువులు, మరుగుదొడ్లు, తాగునీటి వంటి మౌలిక సదుపాయాలను ప్రభుత్వం ఇప్పటికే కల్పించిందని మంత్రి వెల్లడించారు. గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడుతూ పీఎం జనమన్ పథకం కింద రూ.185 కోట్లతో గిరిజన గ్రామాల్లో 130 కొత్త అంగన్‌వాడీ కేంద్రాలను నిర్మిస్తున్నామని తెలిపారు. పిల్లల ఎత్తు, బరువులను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ, పోషకాహార లోపం ఉన్న వారికి అవసరమైన విటమిన్ టాబ్లెట్లు, నాణ్యమైన ఆహారాన్ని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందజేస్తున్నామని తెలిపారు.