Share News

ఇవేమైనా వలంటీర్‌ ఉద్యోగాలా.. తీసేయడానికి?!

ABN , Publish Date - Jun 08 , 2026 | 04:56 AM

‘ఇవేమైనా మీ ప్రభుత్వంలో వేసిన వలంటీర్‌ ఉద్యోగాలు అనుకున్నారా.. తొలగించడానికి...?! ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం. ఈ జాబ్‌ సంపాదించాలంటే ఎంతో శ్రమించి..

ఇవేమైనా వలంటీర్‌ ఉద్యోగాలా.. తీసేయడానికి?!

  • వైసీపీ బెదిరింపు రాజకీయాలు మానుకోవాలి

  • ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎవరూ టచ్‌ చేయలేరు

  • ‘మెగా డీఎస్సీ’ టీచర్లతో మంత్రి సంధ్యారాణి

సాలూరు, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): ‘ఇవేమైనా మీ ప్రభుత్వంలో వేసిన వలంటీర్‌ ఉద్యోగాలు అనుకున్నారా.. తొలగించడానికి...?! ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం. ఈ జాబ్‌ సంపాదించాలంటే ఎంతో శ్రమించి.. ఎన్నో పరీక్షలు పాస్‌ కావాల్సి ఉంది. ప్రభుత్వం మారితే ఆ ఉద్యోగం పోతుంది అనడం.. వైసీపీ బెదిరింపు చర్యలకు పరాకాష్ట. మంత్రిలా కాకుండా గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేసిన అనుభవంతో చెబుతున్నా.. ప్రభుత్వాలు మారినా.. నాయకులు మారినా.. మీ ఉద్యోగాన్ని ఎవరూ టచ్‌ చేయలేరు’ అని మెగా డీఎస్సీ ఉపాధ్యాయులకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి భరోసా ఇచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ఆదివారం పరిశీలించారు. అనంతరం మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులుగా ఎంపికైన 64 మందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగాలను తీసేస్తామని వైసీపీ నాయకులు చెబుతుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు అనే ఎస్‌జీటీ ఉపాధ్యాయుడు మాట్లాడుతూ.. డీఎస్సీ-2018లో కొద్ది మార్కుల తేడాతో జాబ్‌ మిస్‌ అయిందని, ఆ తర్వాత ఏడేళ్ల పాటు ఎంతో కష్టపడి మెగా డీఎస్సీలో ఉద్యోగం సాధించానని పేర్కొన్నారు. ఇప్పుడు కొంత మంది టీచర్లను అగౌరవపరిచేలా మాట్లాడడం చాలా బాధగా ఉందని, ఇది తగదని అన్నారు.

Updated Date - Jun 08 , 2026 | 04:56 AM