తిండిపెట్టిన యజమానినే చంపారు!
ABN , Publish Date - May 26 , 2026 | 04:24 AM
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబం.. రాయలసీమ సంపదను దోచేసిన దోపిడీగాళ్ల కుటుంబమని రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు.
ఆ హత్యతోనే ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగిన వైఎస్ కుటుంబం
హత్యారాజకీయాలు మొదలుపెట్టిందే వాళ్లు.. సీమ సంపదను దోచేశారు
మంగంపేట మైన్స్ నుంచి భారతి సిమెంట్స్ దాకా అంతా అక్రమ సంపాదనే
బలపనూరులో ప్రస్థానం మొదలుపెట్టేనాటికి మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి?
ఇప్పుడు ప్రపంచంలో మీరు పెట్టుబడులు పెట్టని రంగం ఉందా?
వ్యాపారం చేయని దేశమే లేదు.. ఈ స్థాయికి ఎలా చేరుకున్నారు?
మహానాడు ప్రారంభం రోజున వైసీపీ రాష్ట్ర కార్యవర్గ భేటీ పెడతారా?
ఇది మా కార్యక్రమానికి దిష్టిచుక్కలాంటిది.. జగన్ హనీమూన్ నాయకుడు
ఇంగిత జ్ఞానంతో మాట్లాడకపోతే మీరే రోడ్డున పడతారు: రాంప్రసాద్‌రెడ్డి
బలపనూరు నుంచి ప్రస్థానం మొదలుపెట్టి.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఆయన కొడుకు జగన్ రాష్ట్రానికి సీఎంలుగా పనిచేశారు. బలపనూరులో ప్రయాణం ప్రారంభించేనాటికి మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి? నాడు దోపిడీలతో మొదలుపెట్టిన మీరు నేడు ప్రపంచంలో పెట్టుబడులు పెట్టని రంగం.. వ్యాపారం చేయని దేశం లేని స్థాయికి ఎలా చేరుకున్నారు?
- మంత్రి రాంప్రసాద్‌రెడ్డి
అమరావతి, మే 25 (ఆంధ్రజ్యోతి): వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబం.. రాయలసీమ సంపదను దోచేసిన దోపిడీగాళ్ల కుటుంబమని రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో హత్యారాజకీయాలను మొదలుపెట్టిందే ఆ కుటుంబమన్నారు. ఉమ్మడి కడప జిల్లా కోడూరు నియోజకవర్గం మంగంపేటలో లభించే విలువైన ఖనిజం బెరైటీస్ (ముగ్గురాయి) కోసం జగన్ తాత రాజారెడ్డి సొంత ఊరైన పులివెందులను వదిలి కోడూరు నియోజకవర్గానికి వలసవచ్చి అక్కడ మైన్స్ యజమాని వెంకట నరసయ్య వద్ద పనిలోకి చేరారని.. చివరకు తిండి పెట్టిన యజమానినే చంపేసి ఆ మైన్స్‌ను అక్రమంగా దక్కించుకున్నాడని తెలిపారు. ఆ హత్యతోనే వైఎస్ కుటుంబం రాజకీయంగా.. ఆర్థికంగా ఎదగడం మొదలైందన్న విషయాన్ని జగన్ గుర్తుపెట్టుకోవాలన్నారు. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాయలసీమ సంపదను వైఎస్ కుటుంబం దోచేసిందన్నారు. ఆ ప్రాంత ప్రజలను కడగండ్ల పాల్జేసిన రాక్షసులని విమర్శించారు. 1978లో 7.5 ఎకరాలను విజయలక్ష్మి మినరల్స్ ట్రేడింగ్ కంపెనీ పేరిట వైఎస్ కుటుంబం లీజుకు తీసుకుని.. చుట్టుపక్కల ఉన్న వందలాది ఎకరాల ప్రైవేటు భూముల్లోనూ అక్రమంగా మైనింగ్ చేసి కోట్లాది రూపాయలు సంపాదించుకోవడం మొదలుపెట్టిందని వివరించారు. అడుగడుగునా రక్తచరిత్రతో నిండిన తమ కుటుంబాన్ని స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబంగా ఈ తరానికి జగన్ ఎక్కడ పరిచయం చేస్తారోనన్న భయంతో ఈ విషయాలను ప్రజల ముందు ఉంచాల్సి వస్తోందన్నారు. మంత్రి ఇంకా ఏం చెప్పారంటే..
విజయలక్ష్మి మినరల్స్ నుంచి సందూర్ పవర్ వరకు..
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ ఎంపీగా.. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్ సీఎంగా ఉన్న సమయంలో అసెంబ్లీలో వైఎస్ కుటుంబ అక్రమ మైనింగ్‌పై తీవ్ర దుమారం రేగింది. దీంతో సభాసంఘాన్ని నియమించారు. ఆ హౌస్ కమిటీ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన నివేదికలో వైఎస్ కుటుంబం చేసిన తప్పులను బట్టబయలు చేసింది. విజయలక్ష్మి మినరల్స్ పేరుతో 25 వేల టన్నుల ముగ్గురాయిని అక్రమంగా తవ్వి తరలించుకుపోయారు. దీనివల్ల ప్రభుత్వానికి సుమారు రూ.50 లక్షలు నష్టం వాటిల్లింది. అందులో ఏపీఎండీసీ నుంచి రూ.24.21 లక్షలు, విజయలక్ష్మి మినరల్స్ నుంచి రూ.24.21 లక్షలు కట్టాలని డిమాండ్ నోటీసులు జారీచేసినా.. ఆ మొత్తం కట్టకుండా అప్పట్లో వైఎస్ తన అధికారబలాన్ని ఉపయోగించిన విషయం అప్పటి తరం రాజకీయ నాయకులందరికీ తెలుసు. విజయలక్ష్మి మినరల్స్‌తో ఆ రోజు చిన్న అవినీతి మొక్కలా ప్రారంభమైన వైఎస్ కుటుంబ ప్రస్థానం.. నేడు సందూర్ పవర్, భారతీ సిమెంట్స్, మీడియా సంస్థల వరకు ఎదిగింది.
కొత్త సీసాలో పాత సారా..
జగన్ రాష్ట్రానికి హనీమూన్ నాయకుడిగా తయారయ్యాడు. 2024 ఎన్నికల తర్వాత ఈ 24 నెలల్లో ఆయన 10 నుంచి 15 సార్లు మాత్రమే ప్రెస్‌మీట్లు పెట్టారు. ఆయన ఎప్పుడు బయటకు వచ్చినా 40 ఏళ్ల నాటి పాత విషయాలనే.. పాత సారాని కొత్త సీసాలో నింపినట్లుగా చెబుతుంటారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక నిత్యం అక్కసు వెళ్లగక్కుతున్నారు. నాలుగు రోజుల క్రితం లండన్ టూర్ ముగించుకుని రాగానే ప్రెస్ మీట్ పెట్టారు. మా తాత, తండ్రి, చిన్నాన్నను చంపిందెవరో తెలుసా అంటూ చంద్రబాబుపై బురదజల్లే ప్రయత్నం చేశారు. జగన్ తాత ఎలా చనిపోయాడో కడప జిల్లాలో అందరికీ తెలుసు. తండ్రి హత్యను ఎన్ని రకాలుగా రాజకీయంగా వాడుకోవాలో అన్ని రకాలుగానూ వాడుకున్న కొడుకుగా ఆయన రికార్డు సాధించాడు. ఇక బాబాయ్ హత్య విషయానికి వస్తే.. ‘హూ కిల్డ్ బాబాయ్’ అని గూగుల్‌ను అడిగితే ఇట్టే సమాధానం లభిస్తుంది. ప్రతిపక్షంలో ఉంటూ హత్యారాజకీయాలు చేయడం జగన్‌కే చెల్లింది.
జగన్ చెల్లని రూపాయి..
ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్లుగా.. మహానాడు ప్రారంభం రోజునే వైసీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం పెట్టారు. ఈ కార్యక్రమం మహానాడుకు దిష్టిచుక్కలాంటిది. నేను కడప ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినవాడినే.. గతంలో మీ(జగన్)తో కలిసి చాలా ఏళ్లు ప్రయాణం చేశాను. అందుకే చెబుతున్నాను.. చంద్రబాబులాంటి పెద్దమనిషిపై నిందలు వేసేటప్పుడు పూర్వాపరాలు ఆలోచించి, ఇంగితజ్ఞానంతో మాట్లాడాలి. లేకుంటే మీరే రోడ్డునపడతారు. చెల్లని రూపాయుగా మారిన జగన్‌ను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఆయన చిత్తశుద్ధితో ప్రతిపక్ష పాత్ర పోషించాలి. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలూ అసెంబ్లీకి రావాలి. మంచి సలహాలిస్తే స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధం. అసెంబ్లీకి రాకుండా ప్రెస్‌మీట్లతో ప్రభుత్వంపై బురదజల్లాలని చూడడం సరికాదు.