బైకు విన్యాసాలు భళా
ABN , Publish Date - Feb 08 , 2026 | 04:45 AM
‘రాష్ట్ర ప్రభుత్వం ఐటీ, పర్యాటక రంగాలతో పాటు విశాఖలో క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది.
క్రీడలకు అధిక ప్రాధాన్యం మోటార్ రేసింగ్ పోటీల
ప్రారంభోత్సవంలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి
బైక్ రేసింగ్ ఫైనల్స్ చూసేందుకు భారీగా తరలివచ్చిన యువతీయువకులు
విశాఖపట్నం, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్ర ప్రభుత్వం ఐటీ, పర్యాటక రంగాలతో పాటు విశాఖలో క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగానే ఎంఆర్‌ఎఫ్ మోగ్రిప్ సూపర్‌క్రాస్ ఎఫ్‌ఎంఎస్‌సీఐ ఛాంపియన్‌షిప్-2025 ఫైనల్స్ పోటీని నిర్వహించాం’ అని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి చెప్పారు. ఎంఆర్‌ఎఫ్ మోటార్ రేసింగ్ పోటీలను ఆయన శనివారం సాయంత్రం నగరంలోని ఇందిరాప్రియదర్శిని మునిసిపల్ స్టేడియంలో విశాఖ ఎంపీ శ్రీభరత్, వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్‌గోపాల్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ‘యువతకు రేసింగ్ అంటే చాలా ఇష్టం. ఇలాంటి పోటీలు ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించలేదు. విశాఖతోనే శ్రీకారం చుట్టాం. నిర్వాహకులు చక్కటి ఏర్పాట్లు చేశారు’ అని అన్నారు. మంత్రి ఆసక్తిగా పోటీలు ముగిసేంత వరకూ తిలకించారు. రాత్రి పది గంటలకు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీలను చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి యువతీ యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఫ్లడ్ లైట్ల వెలుగులో గాల్లో ఎగురుతున్న బైకులను చూసి కేరింతలు కొట్టారు.