పరిశ్రమలను తరిమేసిన గొడ్డలి పార్టీ
ABN , Publish Date - Jul 06 , 2026 | 05:48 AM
గొడ్డలి పార్టీ ఐదేళ్ల విధ్వంసకర పాలనలో పరిశ్రమలను తరిమేస్తే... కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలోనే ప్రపంచస్థాయి దిగ్గజ సంస్థలను తీసుకొచ్చిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు.
గత ఐదేళ్లలో రాష్ట్రం సర్వనాశనం
రెండేళ్లుగా దిగ్గజ సంస్థలను తీసుకొస్తున్నాం
డబుల్ ఇంజిన్ పాలనలో పురోగతి: మంత్రి పయ్యావుల
అనంతపురం, జూలై 5(ఆంధ్రజ్యోతి): గొడ్డలి పార్టీ ఐదేళ్ల విధ్వంసకర పాలనలో పరిశ్రమలను తరిమేస్తే... కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలోనే ప్రపంచస్థాయి దిగ్గజ సంస్థలను తీసుకొచ్చిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన పూర్తైన సందర్భంగా ఆదివారం ఉరవకొండ నియోజకవర్గంలోని బూదిగుమ్మ గ్రామంలో ‘రెండేళ్ల నమ్మకం-అభివృద్ధి, సంక్షేమం విజయోత్సవ సభ’ నిర్వహించారు. సభలో పయ్యావుల మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల్లో ఉన్నా.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేరుస్తున్నారన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో రాష్ట్రం పురోగతి దిశగా పయనిస్తోందని చెప్పారు. గత ఐదేళ్ల గొడ్డలి పార్టీ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని విమర్శించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక గొడ్డలి పార్టీ ప్రాంతాలు, కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తోందన్నారు. కూటమిని ఏదోవిధంగా చీల్చాలనే ప్రయత్నం చేస్తోందన్నారు. గొడ్డలి పార్టీ ఈ రాష్ర్టానికి హానికరమని స్పష్టం చేశారు. ఆ పార్టీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశంలో రూ.వెయ్యికోట్ల పెట్టుబడులు వస్తే.. అందులో రాష్ర్టానికి రూ.250 కోట్లు వస్తున్నాయంటే అది చంద్రబాబు బ్రాండ్ అనేది ప్రజలు గుర్తుపెట్టుకోవాలన్నారు. అంతకుముందు పెన్నానదిపై రూ.91 కోట్ల వ్యయంతో వంతెన నిర్మాణానికి పయ్యావుల భూమిపూజ చేసి, పనులను ప్రారంభించారు. గత మూడు దశాబ్దాలుగా 8 గ్రామాల ప్రజలకు అక్కడ వంతెన లేకపోవడంతో పూర్తిస్థాయిలో రాకపోకలు నిలిచిపోయాయి. పయ్యావుల తాత పయ్యావుల కేశన్న గతంలో అక్కడ రాళ్లబాట ఏర్పాటు చేశారు. పెన్నానది ఉధృతంగా ప్రవహించడంతో అది కొట్టుకుపోయింది. దీంతో మూడు దశాబ్దాలపాటు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తాత ఆశయం, ప్రజల కలను సాకారం చేస్తూ పయ్యావుల కేశవ్ వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.