Minister Payyavula Keshav: అమరావతికి గ్రాంటు ఇవ్వండి రాయలసీమ రాత మార్చండి
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:40 AM
రానున్న కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అత్యధిక స్థాయిలోరెవెన్యూ గ్రాంట్లు మంజూరు చేయాలి. సాస్కి, పూర్వోదయ పథకాల కింద నిధులు కేటాయించాలి’ అని కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విజ్ఞప్తి చేశారు.
నదుల అనుసంధానానికి చేయూతనివ్వండి
నల్లమలసాగర్‌కు సహకరించండి
ప్రీబడ్జెట్ సమావేశంలో కేంద్రానికి మంత్రి పయ్యావుల వినతి
న్యూఢిల్లీ, జనవరి 10(ఆంధ్రజ్యోతి): ‘రానున్న కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అత్యధిక స్థాయిలోరెవెన్యూ గ్రాంట్లు మంజూరు చేయాలి. సాస్కి, పూర్వోదయ పథకాల కింద నిధులు కేటాయించాలి’ అని కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విజ్ఞప్తి చేశారు. శనివారం అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం నిర్వహించారు. కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో భాగంగా ప్రతిపాదనలు స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రీబడ్జెట్ సమావేశంలో పాల్గొన్న మంత్రి పయ్యావుల రాష్ట్రానికి వివిధ అంశాల కింద నిధుల కేటాయింపునకై విజ్ఞప్తి చేశారు. ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ప్రజల ఆశయాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి పెద్దపీట వేయండి. 2026 ఏప్రిల్ 1 నుంచి 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమల్లోకి వస్తున్నందున అత్యధిక రెవెన్యూ గ్రాంట్లతో పాటు భారీ మొత్తంలో పన్నులు పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది. దేశ ఆర్థిక సమాఖ్య స్ఫూర్తిని మెరుగ్గా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. సాస్కి పథకం కింద రాష్ట్రాల్లో మూల ధన పెట్టుబడులకు ప్రత్యేక సాయం చేయాలని కేంద్రం నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నాం. ఈ పథకాన్ని వచ్చే ఏడాది కూడా అధిక కేటాయింపులతో కొనసాగించండి. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, జీవనోపాధి కల్పించే ప్రాజెక్టులకు అనుగుణంగా పూర్వోదయ మార్గదర్శక సూత్రాలను అమలు చేయాలి.
వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని అమలు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో సూచించారు. అందువల్ల రాయలసీమలో హార్టీకల్చర్ అభివృద్ధి ప్రణాళికలు అమలు చేయాలి. వచ్చే మూడేళ్లలో రూ.41 వేల కోట్లతో సీమ ప్రాంతంలో సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు అమలు చేయడం వల్ల అది అంతర్జాతీయ హార్టీ కల్చర్ కేంద్రంగా మారుతుంది. ఈ బడ్జెట్‌లోనే సీమ ప్రాంతీయ సమగ్రాభివృద్ధి ప్రణాళికను ప్రకటించి నిధులు కేటాయించాలి. విశాఖపట్నం ఆర్థిక ప్రాంతీయ అభివృద్ధి కేంద్రానికి కేంద్ర బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయించాలి. గతేడాది కేంద్రం అందించిన రూ.15 వేల కోట్లతో అమరావతి నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. రాజస్థాన్ 11 నదులను అనుసంధానం చేసే రూ.40 వేల కోట్ల ప్రాజెక్టును కేంద్రం గతంలో జాతికి అంకితం చేసింది. అదేవిధంగా కరువు పీడిత ప్రాంతాలకు తాగనీరు అందించడంతో పాటు పారిశ్రామిక అవసరాలను తీర్చే పోలవరం-నల్లమల్లసాగర్ లింక్ ప్రాజెక్టుకు కేంద్రం తోడ్పాటు అందించాలి’ అని పయ్యావుల కోరారు.