Share News

అర్బన్‌లో గృహ నిర్మాణానికి 2.5 లక్షలు

ABN , Publish Date - Feb 27 , 2026 | 04:20 AM

అర్బన్‌లో పీఎంఏవై కింద ఇంటి నిర్మాణానికి రూ.2.50 లక్షలు అందిస్తున్నామని మంత్రి పార్థసారథి తెలిపారు.

అర్బన్‌లో గృహ నిర్మాణానికి 2.5 లక్షలు

  • ఇల్లు లేని వారికి 2 సెంట్ల స్థలం.. గ్రామాల్లో 3 సెంట్లు

  • అసెంబ్లీలో పార్థసారథి ప్రకటన

అమరావతి, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): అర్బన్‌లో పీఎంఏవై కింద ఇంటి నిర్మాణానికి రూ.2.50 లక్షలు అందిస్తున్నామని మంత్రి పార్థసారథి తెలిపారు. ఇల్లు లేనివారికి అర్బన్‌లో రెండు సెంట్లు, రూరల్‌ ప్రాంతంలో మూడు సెంట్లు ఇస్తామని ప్రకటించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) మాట్లాడుతూ.. కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో అర్బన్‌, రూరల్‌ ప్రాంతాల్లో పీఎం అవాస్‌ యోజన కింద ఇచ్చే లబ్ధిలో చాలా వ్యత్యాసం ఉందన్నారు. అర్బన్‌లో రూ.2.50 లక్షలు, రూరల్‌ ప్రాంత ప్రజలకు రూ.1.59 లక్షలు ఇస్తున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, అందరికీ ఒకేలా నిధులు ఇవ్వాలని కోరారు. గత వైసీపీ ప్రభుత్వంలో కాకినాడలో వందల ఎకరాల్లో లేఅవుట్లు వేసి, పట్టాలిచ్చి లబ్ధిదారులకు స్థలం చూపించలేదన్నారు. లబ్ధిదారుల పట్టాలు పట్టుకుని తిరుగుతున్నారని, రూరల్‌ అయితే మూడు రకాల పట్టాలు ఇచ్చారని అన్నారు.మంత్రి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సభ దృష్టికి తీసుకువచ్చిన అంశాలన్నీ వాస్తవమేనని అన్నారు. కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో పట్టణ ప్రాంతం, రూరల్‌ ప్రాంతంలోని గృహ నిర్మాణానికి తేడా ఉందన్నారు. యూఎల్‌బీ, యూడీఏలో ఒకే రకమైన మొత్తాన్ని అందించామన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యూఎల్‌బీ, యూడీఏలను వేరు చేసిందన్నారు. సీఆర్‌డీఏ, వీఆర్‌డీఏల్లో మాత్రమే యూఎల్‌బీలకు సమానంగా నిధులు ఇసున్నారన్నారు. కాకినాడ అర్బన్‌కు సంబంధించి తేడాలు ఉంటే సరి చేస్తామన్నారు. పట్టాల పంపిణీలో గందరగోళం ఉందని, విచారణ చేసి అనర్హులకు రద్దు చేస్తామని అన్నారు. భూములు ఇచ్చిన రైతులకు డబ్బులు ఇవ్వకుండానే పట్టాలు పంపిణీ చేశారని, స్థలం ఇవ్వని వారికి అర్బన్‌లో రెండు సెంట్లు, రూరల్‌లో మూడు సెంట్లు ఇస్తామని అన్నారు.

Updated Date - Feb 27 , 2026 | 04:21 AM