Share News

రైలెక్కి.. సైకిల్‌ తొక్కి.. ఎలక్ర్టిక్‌ బైక్‌పై..

ABN , Publish Date - May 23 , 2026 | 06:18 AM

‘ప్రజాప్రతినిధులు ప్రజలకు రోల్‌ మోడల్‌గా ఉండాలి. ప్రజల్లో స్ఫూర్తినింపాలి’ అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ ఉద్దేశంతోనే ప్రతి శుక్రవారం నో వెహికిల్‌ డే పాటిస్తున్నట్టు చెప్పారు.

రైలెక్కి.. సైకిల్‌ తొక్కి.. ఎలక్ర్టిక్‌ బైక్‌పై..

  • సచివాలయానికి మంత్రి నిమ్మల

  • మార్గమధ్యలో పల్లానూ ఎక్కించుకుని..

అమరావతి, మే 22(ఆంధ్రజ్యోతి): ‘ప్రజాప్రతినిధులు ప్రజలకు రోల్‌ మోడల్‌గా ఉండాలి. ప్రజల్లో స్ఫూర్తినింపాలి’ అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ ఉద్దేశంతోనే ప్రతి శుక్రవారం నో వెహికిల్‌ డే పాటిస్తున్నట్టు చెప్పారు. శుక్రవారం ఉదయం పాలకొల్లులోని ఇంటి నుంచి సైకిల్‌పై రైల్వేస్టేషన్‌కు వచ్చి, ప్యాసింజర్‌ రైలులో రామవరప్పాడు చేరుకున్నారు. అక్కడి నుంచి సైకిల్‌పై 18 కిలోమీటర్ల దూరంలోని మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి బయలుదేరారు. మార్గమధ్యలో కొలనుకొండ దగ్గర మంత్రి నిమ్మలను చూసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ తన వాహనం దిగి, మంత్రి సైకిల్‌ ఎక్కారు. ఇద్దరూ కలిసి సైకిల్‌పై టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని, శిక్షణా తరగతుల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి ఎలక్ట్రికల్‌ బైక్‌పై అమరావతి సచివాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపు పాటించాలన్నారు. నాయకులు పాటిస్తే సాధారణ ప్రజలు, యువత ఆచరిస్తారని చెప్పారు. పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభ నేపథ్యంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపును పురస్కరించుకుని ఇంధన పొదుపు పాటిస్తున్నట్లు చెప్పారు. పాలకొల్లు నుంచి ప్యాసింజర్‌ ట్రైన్‌లో వచ్చానని, ప్రయాణికుల సమస్యలు, కూటమి పాలనపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నానని చెప్పారు.

Updated Date - May 23 , 2026 | 06:19 AM