Minister Nimmala Ramanaidu: సీమ ఎత్తిపోతలను ఆపింది జగనే!
ABN , Publish Date - Jan 07 , 2026 | 03:07 AM
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి హోదాలో 2020లోనే వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆపేశారని జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు తేల్చి చెప్పారు.
స్వీయ ప్రయోజనాల కోసమే ఈ స్కీంకు డిజైన్: నిమ్మల
పర్యావరణ అనుమతుల్లేకుండానేడీపీఆర్ తయారీ పేరిట పనులు
990 కోట్ల ప్రజాధనం వృధా
ప్రభుత్వంపై 750 కోట్ల రుణభారం
అమరావతి, జనవరి 6(ఆంధ్రజ్యోతి): రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి హోదాలో 2020లోనే వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆపేశారని జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు తేల్చి చెప్పారు. స్వీయ ప్రయోజనాల కోసమే ఈ పథకానికి డిజైన్ చేశారని.. 2020 మే 5న రూ.3,825 కోట్లతో పాలనానుమతులు ఇచ్చి, పనులు ప్రారంభించారని.. ఇది జరిగిన 15 రోజులకే.. మే 20న పర్యావరణ అనుమతులు లేనందున ప్రాజెక్టు నిర్మాణం నిలిపివేయాలంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) ఆదేశించిందని తెలిపారు. అంటే చేపట్టిన 15 రోజుల్లోనే జగన్ దీనిని నిలిపివేశారని ధ్వజమెత్తారు. వెలగపూడి సచివాలయంలో మీడియా సమక్షంలో మంగళవారం ఈ అంశంపై మంత్రి పవర్ పాయిట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సీమ ఎత్తిపోతలను సీఎం చంద్రబాబుతో మాట్లాడి తానే ఆపేయించానంటూ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను విలేకరులు ఈ సందర్భంగా ప్రస్తావించగా.. తెలంగాణలో రాజకీయ ఎత్తుగడల నేపథ్యంలో పరస్పర ఆరోపణలు, విమర్శలున్నాయని చెప్పారు. అయితే ఆ రాష్ట్ర రాజకీయాలను ఆంధ్రప్రదేశ్‌కు ఆపాదిస్తూ జగన్ అవినీతి పత్రిక నాలుగు రోజులుగా అబద్ధాలను పుంఖానుపుంఖాలుగా రాస్తోందని విమర్శించారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు కౌంటర్ ఇస్తూ.. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తామే ఆపేయించామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ‘అసలీ పథకాన్ని తానే ఆపేసి.. జగన్ రాయలసీమలో చిచ్చుపెట్టేందుకు విషప్రచారం చేస్తున్నారు. ప్రాజెక్టును ఆపేయాలని ఎన్‌జీటీయే ఆదేశాలిచ్చాక వేరెవరో ఆపేయాల్సిన అవసరం ఏముంది? జగన్ పర్యావరణ అనుమతులు లేకుండా డీపీఆర్ పేరుతో ప్రాజెక్టు పనులు చేపట్టారు. దీంతో ఎన్‌జీటీ షోకాజ్ నోటీసులిచ్చింది. రూ.2.65 కోట్ల అపరాధ రుసుం వసూలు చేసింది. ఈ ప్రాజెక్టు పేరిట రూ.990 కోట్ల ప్రజాధనాన్ని జగన్ వృధా చేశారు. ప్రభుత్వంపై రూ.750 కోట్ల రుణ భారం కూడా పడింది. ఈ చెల్లింపులపై విచారణకు ఆదేశిస్తాం. శ్రీశైలం రిజర్వాయరులో 841 అడుగుల నుంచి 800 అడుగుల మధ్య అందుబాటులోని 34.3 టీఎంసీలను ఎత్తిపోయడమే ఈ పథకం లక్ష్యమైతే.. అందులో రాష్ట్ర వాటా 22.6 టీఎంసీలు మాత్రమే. ఈ నీళ్లను రోజుకు మూడు టీఎంసీల చొప్పున వారం రోజుల్లోనే పంపింగ్ చేసుకునే వీలుంది. ఇందుకోసం ఎత్తిపోతల పథకం పేరిట రూ.3,825 కోట్లు వ్యయం చేయడం అవసరమో కాదో మేధావులు, సాగునీటి నిపుణులు, జర్నలిస్టులు మాత్రమే చెప్పాలి’ అని అన్నారు.
పెద్దిరెడ్డి కంపెనీకి అక్రమంగా 1,067 కోట్లు!
గాలేరు-నగరి, హంద్రీ-నీవాపనుల పేరిట చెల్లించారు: నిమ్మల
గాలేరు-నగరి సుజల స్రవంతి, హంద్రీ-నీవా లింక్ కెనాల్ అంటూ 2020 ఆగస్టు 26న రూ.5,036 కోట్లతో పనులకు నాటి సీఎం జగన్ పరిపాలనా అనుమతి ఇచ్చారని మంత్రి నిమ్మల తెలిపారు. ఈ పనులను తన ప్రభుత్వంలోని పర్యావరణ, అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ పీఎల్‌ఆర్‌కు అప్పగించారని తెలిపారు. ‘ఆ కంపెనీ మెత్తటి మట్టి ఉన్న చోట తవ్వకాలు చేపట్టి.. రాళ్లు తగిలే చోట వదిలేసింది. పైపులను కలుపకపోయినా.. దానికి జగన్ రూ.1,067.84 కోట్లను చెల్లించేశారు. అనంతరం ఈ డబ్బులు బ్యాంకు ఖాతాల నుంచి మళ్లిపోయాయి. భూసేకరణ చేయకుండా.. నిర్వాసితులకు డబ్బులు ఇవ్వకుండానే భూములు లాక్కున్నారు. పర్యావరణ అనుమతులు లేకుండానే 2,144 కోట్లతో ముదివేడ, నేతిగుంటపల్లి, ఆవులపల్లి రిజర్వాయర్లు చేపట్టి.. పీఎల్‌ఆర్‌కు ఇంకో రూ.690 కోట్లు చెల్లించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రిజర్వాయర్లపై సమీక్షిస్తే.. పనులేవీ కనిపించలేదు. పర్యావరణ అనుమతులు లేకపోవడంతో ఈ రిజర్వాయర్లకు ఎన్‌జీటీ రూ.100 కోట్ల పెనాల్టీ విధించింది. ఇందులో రూ.25 కోట్లను కూటమి ప్రభుత్వం కట్టాల్సి వచ్చింది. పైగా ఈ పనులు నిలిపివేయాలని కూడా ఎన్‌జీటీ ఆదేశించింది. వీటి నిర్మాణానికి భూసేకరణ కింద రూ.191 కోట్లను రైతులకు చెల్లించాల్సి ఉంటే ఒక్క పైసా కూడా జగన్ చెల్లించలేదు. ఈ పనులపై కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది’ అని చెప్పారు.