ఎండా.. వాన.. సైకిల్‌పై నిమ్మల
ABN , Publish Date - Jun 06 , 2026 | 05:30 AM
మంత్రి నిమ్మల రామానాయుడు వరుసగా మూడో శుక్రవారం విజయవాడ నుంచి సచివాలయానికి సైకిల్‌పై వచ్చారు. వెళ్లేటప్పుడు ఎండలో స్వేదం చిందిస్తూ సైకిల్ తొక్కిన ఆయన..
మొత్తం 40 కిలోమీటర్లు సవారీ
అమరావతి, జూన్ 5(ఆంధ్రజ్యోతి): మంత్రి నిమ్మల రామానాయుడు వరుసగా మూడో శుక్రవారం విజయవాడ నుంచి సచివాలయానికి సైకిల్‌పై వచ్చారు. వెళ్లేటప్పుడు ఎండలో స్వేదం చిందిస్తూ సైకిల్ తొక్కిన ఆయన... తిరిగి సచివాలయం నుంచి వస్తున్నప్పుడు వర్షంలో తడుస్తూ ముందుకు వెళ్లారు. విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి సచివాలయానికి. అక్కడి నుంచి తిరిగి క్యాంప్ కార్యాలయానికి మొత్తం 40 కిలోమీటర్లు సైకిల్ తొక్కారు. శుక్రవారం సచివాలయానికి వెళ్తూ మార్గమధ్యంలో కొండవీటి వాగు వద్ద ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జలవనరులశాఖ ఉద్యోగులతో కలిసి మొక్కలు నాటారు. సీడ్ యాక్సెస్ రోడ్డులో పని చేస్తున్న మహిళా కూలీల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి శుక్రవారం నో వెహికిల్ డేగా పాటించాలని సీఎం చంద్రబాబు సూచించారని, అందుకే సైకిల్‌పై సచివాలయానికి వచ్చానని చెప్పారు. నాయకులు ఆచరించి చూపిస్తే ప్రజల్లోనూ మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
