సీమ ద్రోహి జగన్: నిమ్మల
ABN , Publish Date - Jul 13 , 2026 | 04:05 AM
రాయలసీమకు గొడ్డలి పార్టీ నేత జగన్ ద్రోహం చేశాడని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. ఆయన ఐదేళ్ల పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అరబస్తా సిమెంటు.
హిందూపురం, జూలై 12 (ఆంధ్రజ్యోతి): రాయలసీమకు గొడ్డలి పార్టీ నేత జగన్ ద్రోహం చేశాడని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. ఆయన ఐదేళ్ల పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అరబస్తా సిమెంటు, తట్టెడు మట్టి వేసిన దాఖలాలూ లేవని చెప్పారు. హంద్రీ-నీవా మోటారు, విద్యుత్ బిల్లులు చెల్లించలేదన్నారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలం రాచపల్లివద్ద ఆదివారం హంద్రీనీవా మడకశిర ఉపకాలువ వెడల్పు పనులను ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి నిమ్మల ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఎక్స్‌కవేటర్‌ను బాలకృష్ణ ఆపరేట్ చేయగా.. మంత్రి ఆయన పక్కనే నిలుచున్నారు. అనంతరం నిమ్మల మాట్లాడుతూ కూటమి అధికారం చేపట్టాక ఇరిగేషన్‌కు రూ.25వేల కోట్లు కేటాయించామని, ఇందులో రూ.12వేల కోట్లు రాయలసీమకే ఇచ్చామని తెలిపారు. ఐదేళ్ల గొడ్డలి పార్టీ హయాంలో రూ.2 వేల కోట్లు మాత్రమే కేటాయించారని.. దీనినిబట్టి రాయలసీమపై ఎవరికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోం దన్నారు. రాయలసీమను రతనాలసీమగా మార్చాలనే దృఢ సంకల్పంతో వెనుకబడిన మడకశిర బ్రాంచ్ కెనాల్‌కు చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారని.. హిందూపురం, పెనుకొండ, మడకశిర నియోజకవర్గాలను సుభిక్షం చేయడానికి రూ.790 కోట్లు కేటాయించారని తెలిపారు.