అమరావతిపై జగన్‌కు కడుపుమంట
ABN , Publish Date - Apr 12 , 2026 | 05:51 AM
అమరావతిలో మౌలిక సదుపాయాలు, భవన నిర్మాణాల పనులు శరవేగంగా సాగుతుండటాన్ని చూసి.. కడుపుమంటతోనే జగన్ మరోసారి అమరావతిపై విషం కక్కుతున్నారని...
అందుకే రాజధానిపై విషం కక్కుతున్నారు: మంత్రి నారాయణ
అమరావతి, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): అమరావతిలో మౌలిక సదుపాయాలు, భవన నిర్మాణాల పనులు శరవేగంగా సాగుతుండటాన్ని చూసి.. కడుపుమంటతోనే జగన్ మరోసారి అమరావతిపై విషం కక్కుతున్నారని మంత్రి పొంగూరు నారాయణ మండిపడ్డారు. అమరావతిలో పనులు ఇంత వేగంగా పూర్తవుతాయని జగన్ ఊహించలేదన్నారు. దీంతో ఆయనలో ఆందోళన మొదలైందని, అమరావతిపై పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే జగన్ కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై పార్లమెంటులో చర్చ జరుగుతుండగా.. తాడేపల్లి ప్యాలె్‌సలో జగన్ ప్రెస్‌మీట్ పెట్టి ‘మావిగన్’ అంటూ కొత్త ప్రతిపాదన తీసుకురావడాన్ని రాష్ట్ర ప్రజలతోపాటు వైసీపీ వాళ్లు కూడా ఛీ కొడుతున్నారని విమర్శించారు. ‘‘మావిగన్’ గురించి వైసీపీ ఎంపీలకు ముందుగా ఏమీ చెప్పకపోవడంతో ఏం చేయాలో తెలియక వారు పార్లమెంటు నుంచి బయటకు వచ్చేశారు. ఒక్క వైసీపీ తప్ప దేశంలోని అన్ని పార్టీలు అమరావతికి మద్దతు పలికాయి. అమరావతిని ఎవరూ కదిలించలేరు.’’ అని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు వంటి వైసీపీ నేతలు ‘మావిగన్’పై ఏం చెప్పాలో తెలియక ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. విశాఖపట్నాన్ని రాజధానిని చేస్తానని జగన్ ప్రకటిస్తే.. అక్కడే వైసీపీ తుడిచిపెట్టుకుపోయిందని గుర్తు చేశారు.
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ జగన్ పిచ్చి పనులతో రాజధాని అమరావతిలో పనులు నిలిపివేయడం వల్లే ఇప్పుడు రేట్లు భారీగా పెరిగిపోయాయని మంత్రి నారాయణ తెలిపారు. 2014-19 మధ్య కాలంలో రూ.51 వేల కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచామని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్.. ఆ పనులను కొనసాగించి ఉంటే ఇప్పుడు ఖర్చు పెరిగేది కాదన్నారు. అమరావతి అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని, అయితే.. 2028, ఆగస్టు నాటికి మౌలిక సదుపాయాల పనులు పూర్తవుతాయని మంత్రి నారాయణ తెలిపారు. ఇప్పటి వరకు రూ.10 వేల కోట్లతో పనులు చేశామని వివరించారు.