‘రాయల్’ సీమగా మారుస్తాం!
ABN , Publish Date - Jun 13 , 2026 | 03:55 AM
రాయలసీమను ‘రాయల్’ సీమగా మార్చడమే లక్ష్యమని, లక్ష కోట్ల రూపాయలతో చేపట్టబోయే మిషన్ రాయలసీమ ప్రాజెక్టు దేశానికే ఆదర్శం కాబోతోందని మంత్రి లోకేశ్ తెలిపారు.
లక్ష కోట్లతో మిషన్ రాయలసీమ
కూటమి ధర్మాన్ని పాటిద్దాం
పదో తరగతిలో టీచర్లు జగన్‌ను చితక్కొట్టారు.. అందుకే వారిపై కోపం
‘డీఎస్సీ’లో రాజ్యాంగంపైనే ఆరోపణలు
బౌలర్లు మారినా బ్యాట్స్‌మన్ ఓన్లీ సీబీఎన్: లోకేశ్
‘‘డీఎస్సీ విషయంలో జగన్.. నన్ను, సీబీఎన్‌ను, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తున్నారు. రిజర్వేషన్లను ప్రశ్నిస్తున్నారు. జగన్.. ఎన్ని జన్మలెత్తినా డీఎస్సీని ఆపలేరు..’’
- మంత్రి లోకేశ్
తిరుపతి సిటీ, జూన్ 12(ఆంధ్రజ్యోతి): రాయలసీమను ‘రాయల్’ సీమగా మార్చడమే లక్ష్యమని, లక్ష కోట్ల రూపాయలతో చేపట్టబోయే మిషన్ రాయలసీమ ప్రాజెక్టు దేశానికే ఆదర్శం కాబోతోందని మంత్రి లోకేశ్ తెలిపారు. తిరుపతి విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఇగోలు పక్కన పెట్టి కూటమి ధర్మాన్ని పాటిద్దామని పిలుపునిచ్చారు. ‘‘రాయల్ ఎన్ ఫీల్డ్, క్యారియర్, ఎల్‌జీ, రిలయన్స్ పరిశ్రమలు సీమకే వచ్చాయి. టీడీపీ, జనసేన, బీజేపీలది పెద్ద కుటుంబం. రాష్ట్రం కోసం, ప్రజల కోసం అందరూ కలిసి పనిచేయాలి. ఇగోలు వద్దు, ఏదైనా సమస్య ఉంటే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. కూటమి ధర్మాన్ని అందరూ పాటించాలి. అహంకారం వద్దు.. అహంకారం వల్లే వైసీపీ 151 నుంచి 11 స్థానాలకు పడిపోయింది’’ అని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే..
వెంకన్నతో పెట్టుకోవద్దని ఆరోజే చెప్పా
ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇదే చంద్రగిరి గడ్డపై ఒక మాట చెప్పా. తిరుమల వెంకన్న చాలా పవర్ ఫుల్.. ఆయనతో పెట్టుకోవద్దు.. మాడి మసై పోతావని జగన్‌కు చెప్పా. ఆయనకి అర్థం కాలేదు. డైరెక్ట్‌గా స్వామితోనే పెట్టుకున్నారు. 2024లో ఏం జరిగిందో మీరంతా చూశారు. 2019 నుంచి ఐదేళ్లు గొడ్డలి పార్టీ అరాచక పరిపాలన చూశాం. టీడీపీ జెండా లేకుండా చేస్తామన్నారు. ప్రజలే వాళ్ల జెండా పీకేశారు. వైనాట్ 175 అన్నారు. ప్రజలు టీమ్ 11 ఇచ్చారు. వాళ్లు సిద్ధం అంటే.. ప్రజలు యుద్ధం అన్నారు. మమ్మల్ని అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వం అన్నారు, ప్రజలే వాళ్లని అడుగు పెట్టకుండా చేశారు. ఇప్పుడు రప్పా రప్పా అంటున్నారు.. ప్రజలే రఫ్పాడిస్తారు.
విరాట్ కోహ్లీ మన సీబీఎన్
రాజకీయాల్లో విరాట్ కోహ్లీ మన సీబీఎన్. అవతల వైపు బౌలర్లు మారతారు తప్ప.. ఇటువైపు ఒకే ఒక్క బ్యాట్స్‌మన్ సీబీఎన్. అటువైపు బౌలర్ ఎవరైనా ఇటు సూపర్ సిక్స్‌కొట్టేది మాత్రం మన సీబీఎన్. రాయలసీమను ‘రాయల్’సీమగా మార్చేసింది మన సీబీఎన్. అప్పుడు కియా.. ఇప్పుడు రాయల్ ఎన్ ఫీల్డ్. డ్రిప్ ఇరిగేషన్‌తో సీమలో బంగారం పండేలా చేసింది, హంద్రీ-నీవా సుజల స్రవంతి ద్వారా కుప్పానికే కాదు పులివెందులకు కూడా నీళ్లు ఇచ్చి, ఇప్పుడు లక్ష కోట్ల రూపాయలతో మిషన్ రాయలసీమ ప్రారంభిస్తోంది కూడా మన సీబీఎన్.
మనది గూగుల్.. వాళ్లది గొడ్డలి
ప్రజా ప్రభుత్వ నినాదం ఒక్కటే. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని.. అభివృద్ధి వికేంద్రీకరణ. దేశంలోకి వచ్చిన ప్రతి వందలో 25 శాతం పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్‌కే వచ్చాయి. మనది గూగుల్.. వాళ్లది గొడ్డలి. మనది ఫైటర్ జెట్స్.. వాళ్లది ఫ్యాక్షన్. మనది కియా.. వాళ్లది కిడ్నాప్. మనది విశ్వసనీయత.. వాళ్లది నేరం. మనది అభివృద్ధి.. వాళ్లది విధ్వంసం. మనది బుల్లెట్.. వాళ్లవి బూతులు. మనది మహిళలకు 33శాతం రిజర్వేషన్. వాళ్లది సొంత తల్లిని, చెల్లిని గెంటేయడం. జగన్ అనే పేరులో ఉన్న జీని ‘జెన్ జీ’ అనుకుంటున్నాడు. కానీ జగన్‌లో ఉన్న జీ అంటే గొడ్డలి. జగన్‌కి సీసీడీ అనే జబ్బుంది. సీసీడీ అంటే క్రెడిట్ చోరీ డిజార్డర్. మేం కష్టపడి గూగుల్‌ను తీసుకువస్తే.. ప్రెస్‌మీట్ పెట్టి వాళ్ల వల్లనే వచ్చిందన్నారు. ఆర్సెలార్ మిట్టల్ తానే తెచ్చానని మీడియాతో చెబుతారు. ఇంకొంచెం టైమ్ ఇస్తే ఆగస్టు 15న ప్రెస్‌మీట్ పెట్టి దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది మా తాత అని ప్రకటిస్తాడు. చిన్నపుడు 10వ తరగతి పేపర్ లీక్‌లో దొరికితే వాళ్ల టీచర్లు జగన్‌ను చితగ్గొట్టారు. అందుకే ఆయనకు టీచర్లంటే కోపం. వారిని మద్యం దుకాణాల ముందు నిలబెట్టిన చరిత్ర జగన్‌ది. మెగా డీఎస్సీని అడ్డుకోడానికి 226 కేసులు వేశారు. 150 రోజుల్లో మనం మెగా డీఎస్సీ నిర్వహించాం. ఇందులో ఏదో జరిగిందని బురద జల్లుతున్నారు. మొన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం జరిగి కొంతమంది కార్మికులు చనిపోయారు. చనిపోయిన పర్మినెంట్ ఉద్యోగి కుటుంబానికి ప్రజాప్రభుత్వం రూ.2 కోట్లు ఇస్తుంది. కాంట్రాక్టు ఉద్యోగి కుటుంబానికి రూ.కోటి ఇస్తుంది. పర్మినెంట్ జాబ్ కూడా ఇస్తున్నాం. ఎవరైనా ఇంకా ఎక్కువ ఇవ్వమని అడగొచ్చు. కానీ, జగన్ తగ్గించి కోటి ఇవ్వమని డిమాండ్ చేశారు.
త్వరలో కర్నూలుకు హైకోర్టు బెంచ్
‘ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మనకి గౌరవం దక్కుతుంది. ప్రపంచం మొత్తం మన దేశం వైపు చూస్తుంది. దానికి కారణం మన ప్రధాని మోదీ. ఆయన రికార్డ్స్ బద్దలు కొట్టడం ఎవరికీ సాధ్యం కాదు. దేశం మొత్తం నమో అంటే నరేంద్ర మోదీ. ఏపీలో మాత్రం నమో అంటే నాయుడు, మోదీ. విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్, అమరావతి, పోలవరానికి నిధులు, ఫైటర్ జెట్, ఏఎంసీఏ ప్రాజెక్టులు వచ్చాయి. త్వరలో కర్నూలుకు హైకోర్టు బెంచ్‌ని తీసుకురాబోతున్నాం’ అని లోకేశ్ తెలిపారు.