Share News

పెట్టుబడులతో ఏపీకి రండి!

ABN , Publish Date - Jul 09 , 2026 | 03:36 AM

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ దక్షిణ కొరియా పర్యటన కొనసాగుతోంది. బుధవారం ఆయన పలు కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. పెట్టుబడులకు ఏపీ అన్ని విధాలా అనుకూలమని..

పెట్టుబడులతో ఏపీకి రండి!

  • సింగిల్‌ విండో విధానంలో అనుమతులు

  • మారిటైమ్‌ వ్యాపారానికి ఏపీ అనుకూలం

  • దక్షిణ కొరియా పర్యటనలో మంత్రి లోకేశ్‌

అమరావతి, జూలై 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ దక్షిణ కొరియా పర్యటన కొనసాగుతోంది. బుధవారం ఆయన పలు కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. పెట్టుబడులకు ఏపీ అన్ని విధాలా అనుకూలమని, తమ రాష్ట్రంలో స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ విధానాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. నాలుగో రోజు పర్యటనలో లోకేశ్‌ సియోల్‌ నుంచి దక్షిణ కొరియా ప్రముఖ వాణిజ్య కేంద్రమైన బుసాన్‌కు రైల్లో వెళ్లారు. కొరియా మెరైన్‌ ఎక్విప్‌మెంట్ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్నారు. బీఎన్‌కే ఫైనాన్సియల్‌, బూయంగ్‌, హ్వాసంగ్‌ గ్రూప్‌లతో వేర్వేరుగా భేటీలకు హాజరయ్యారు. మారిటైమ్‌ వ్యాపారానికి ఆంధ్రప్రదేశ్‌ అత్య ంత అనుకూలమని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారు.

బుసాన్‌లో పెట్టుబడిదారుల సహాయ కేంద్రం

బుసాన్‌లో ఏపీఈడీపీ ఆధ్వర్యంలో ‘అపెక్స్‌ కొరియా’ పేరిట ఏర్పాటు చేసిన పెట్టుబడిదారుల సహాయ, అనుసంధాన కేంద్రాన్ని లోకేశ్‌ ప్రారంభించారు. ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి చూపే కొరియా సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఇది అనుసంధానకర్తగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో యూనిట్లు ఏర్పాటు చేసిన సంస్థలకు కూడా అవసరమైన సేవలు అందిస్తుందని చెప్పారు.


బీఎన్‌కే ఫైనాన్సియల్‌ శాఖ ఏర్పాటు చేయండి

బీఎన్‌కే ఫైనాన్సియల్‌ గ్రూప్‌ ఎండీ లీ క్వాంగ్‌, బీఎన్‌కే క్యాపిటల్‌ సీఈవో సన్‌ డే జిన్‌, ఎస్‌సన్‌ బో కంపెనీ చైర్మన్‌ క్యూమ్‌సిక్‌, హ్యూండయ్‌ మోటార్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గ్లోబల్‌ కోఆపరేషన్‌ చోయ్‌ హూన్‌తో లోకేశ్‌ సమావేశమయ్యారు. అమరావతిలో బీఎన్‌కే ఫైనాన్సియల్‌ శాఖను ఏర్పాటు చేయాలని కోరారు. పెట్టుబడులు, నిధుల నిర్వహణ, కన్సల్టింగ్‌ సేవల ద్వారా స్టార్ట్‌పలు, ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇచ్చేందుకు బీఎన్‌కే వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ.. ఏపీలోని రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ (ఆర్‌టీఐహెచ్‌)లో మెంబర్‌/మెంటర్‌గా చేరాలని కోరారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టులైన అమరావతి, పారిశ్రామిక పార్కులు, విద్యుత్తు మౌలిక సదుపాయాలు తదితర వాటికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్సింగ్‌ అందించే అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై ఉన్నతస్థాయిలో సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని బీఎన్‌కే ఫైనాన్సియల్‌ గ్రూప్‌ ప్రతినిధులు వెల్లడించారు.

యూనిట్‌ స్థాపనకు ‘బూయంగ్‌’ సుముఖత

పాదరక్షలు, షూలేసులు, మెటల్‌ హార్డ్‌వేర్‌, అనుబంధ పరికరాల తయారీ యూనిట్‌ను ఏపీలో నెలకొల్పాలని బూయంగ్‌ గ్రూప్‌ సీఈవో ర్యాన్‌ క్యాంగ్‌ను లోకేశ్‌ కోరారు. సింగిల్‌ విండో విధానంలో అనుమతులు ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో బూయంగ్‌ యూనిట్‌ను ఏర్పాటుకు ఆ కంపెనీ ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడీ బిల్డ్‌ షెడ్ల కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపారు.


‘దుగరాజపట్నం’లో పెట్టుబడులకు ఆహ్వానం

భారత తూర్పు తీరంలో మారిటైమ్‌ వ్యాపారానికి ఆంధ్రప్రదేశ్‌ అత్యంత అనుకూలమని కొరియన్‌ మెరైన్‌ ఎక్విప్‌మెంట్ అసోసియేషన్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. ప్రతి 50 కిలోమీటర్లకూ ఒక ఓడరేవు /షిప్‌యార్డు/ఫిషింగ్‌ హార్బర్‌ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉన్నామని వివరించారు. భారత్‌లో మొదటి స్టేట్‌ అప్రూవ్డ్‌ షిప్‌ బిల్డింగ్‌ క్లస్టర్‌ను దుగరాజపట్నంలో రూ.30 వేల కోట్లతో 3488 ఎకరాల్లో నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఈ క్లస్టర్‌ శ్రీసిటీ, కృష్ణపట్నం పోర్టులకు సమీపంలో ఉంటూ కనెక్టివిటీ కలిగి ఉందని వివరించారు. భారత ఎగుమతి మార్కెట్‌ కోసం కొరియన్‌ పరికరాలను స్థానికీకరించడానికి, ప్లగ్‌ అండ్‌ ప్లే మౌలిక సదుపాయాలు, ఉమ్మడి సౌకర్యాల ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. దుగరాజపట్నం క్లస్టర్‌లో టెస్టింగ్‌/సర్టిఫికేషన్‌ ల్యాబ్‌లతో పాటు ఇం జన్లు, ప్రొపల్షన్‌, నావిగేషన్‌, డెక్‌ మెషినరీ, ఎలక్ట్రికల్స్‌ అవుట్‌ ఫిట్టింగ్‌, ప్రత్యేక మెరైన్‌ పరికరాల తయారీ అనుబంధ పార్కును ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రత్యేక కొరియన్‌ మెరైన్‌ ఎక్విప్‌మెంట్ డెస్క్‌, ఇండియా షిప్‌ టెక్నాలజీ సెంటర్‌, ఉమ్మడి నైపుణ్య శిక్షణ, పరిశోధనాభివృద్ధి ఏర్పాటుకు రాష్ట్ర మారిటైమ్‌ బోర్డుతో భాగస్వామ్యం కావాలని కొరియన్‌ మెరైన్‌ ఎక్విప్‌మెంట్ అసోసియేషన్‌ను ఆహ్వానించారు.


కుప్పంలో హ్వాసంగ్‌ యూనిట్‌

రాష్ట్రంలో హ్వాసంగ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని ఆ కంపెనీ ఉన్నత స్థాయి బృందానికి మంత్రి లోకేశ్‌ ప్రతిపాదించారు. ఈ సందర్భంగా కుప్పంలో హ్వాసంగ్‌ పాదరక్షల తయారీ కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చిన హ్వాసంగ్‌ యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్పారు. ఇంటిగ్రేటెడ్‌ ఫుట్‌వేర్‌ కాంపోనెంట్‌ అండ్‌ మెటీరియల్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌ ఫెసిలిటీని కూడా కుప్పంలోనే ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా కోరారు. నెక్స్ట్‌ జెన్‌ అఽథ్లెటిక్స్‌ ఫుట్‌వేర్‌ ఆర్‌అండ్‌డీ, ఆసియా ఫసిఫిక్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని హ్వాసంగ్‌ సంస్థ సీఈవో వెల్లడించారు.

షూఆల్స్‌ ఫ్యాక్టరీ సందర్శన

బుసాన్‌లోని ప్రఖ్యాత మెడికల్‌ డివైస్‌ సర్టిఫైడ్‌ స్మార్ట్‌ హెల్త్‌కేర్‌ ఫుట్‌వేర్‌ తయారీ సంస్థ షూఆల్స్‌ ఫ్యాక్టరీని లోకేశ్‌ సందర్శించారు. రక్త ప్రసరణను ఉత్తేజపరచటం, కండరాల అలసటను తగ్గించడానికి మెడికల్‌ మాగ్నెటిక్‌ జనరేటర్లు, చిప్‌ల అంతర్నిర్మిత సాంకేతికతతో తయారవుతున్న బూట్లను పరిశీలించారు. నడకలో అసౌకర్యం లేకుండా, పాదాలను ఆరోగ్యవంతంగా ఉంచడానికి ప్రత్యేకమైన మెడిచియో వైబ్రేషన్‌ చిప్‌లను బూట్లలో అమర్చే విధానాన్ని కూడా పరిశీలించారు. మాగ్నెటిక్‌ థెరపీ షాక్‌ అబ్జార్‌ప్షన్‌, కూలింగ్‌ సోల్స్‌, యాంటీ బాక్టీరియల్‌ మెటీరియల్స్‌ ఏకీకరణతో ఎంఎ్‌ఫడీఎస్‌ సర్టిఫికేషన్‌ మెడికల్‌ ఫుట్‌వేర్‌ తయారీలో తమ సంస్థ ప్రత్యేకతను కలిగి ఉందని షూఆల్స్‌ ప్రతినిధులు వివరించారు.

Updated Date - Jul 09 , 2026 | 03:37 AM