ప్రజలకు చేరువగా ‘మన మిత్ర’
ABN , Publish Date - Jun 27 , 2026 | 04:17 AM
ప్రజలకు ‘మన మిత్ర’ (వాట్సాప్ గవర్నెన్స్) సేవలను మరింత చేరువ చేయాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు.
కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ సరళతరం
బిడ్డ పుట్టిన వెంటనే కుటుంబ వివరాలన్నీ నమోదు
ప్రభుత్వ పథకాలన్నీ అప్పుడే పుట్టిన బిడ్డకూ దక్కాలి
రియల్ టైమ్‌లో జనన, మరణాల నమోదు
ఆధార్‌తో సర్టిఫికెట్లన్నీ డిజీ వెరిఫై కావాలి: లోకేశ్
అమరావతి, జూన్ 26(ఆంధ్రజ్యోతి): ప్రజలకు ‘మన మిత్ర’ (వాట్సాప్ గవర్నెన్స్) సేవలను మరింత చేరువ చేయాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల మంజూరులో ఎలాంటి అడ్డంకులూ లేకుండా, పత్రాల జారీ ప్రక్రియ సరళంగా ఉండాలని సూచించారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ‘మన మిత్ర’పై శాఖాధిపతులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ పరిధిలోని శాఖల ప్రగతిని గురించి ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం లోకేశ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో బిడ్డ పుట్టిన వెంటనే కులంతో సహా కుటుంబ సమాచారాన్నంతటినీ నిక్షిప్తం చేయాలని ఆదేశించారు. బిడ్డ పుట్టినప్పటి నుంచే ప్రభుత్వ పథకాలన్నీ దక్కాల్సిందేనని స్పష్టం చేశారు. జననం నుంచి మరణం వరకూ రియల్ టైమ్‌లో సమాచారం నమోదు కావాలని పేర్కొన్నారు. ‘‘ప్రభుత్వ శాఖల సమాచారాన్ని క్రోడీకరించి సంక్షిప్తం చేసే కార్యక్రమం వచ్చే నెలాఖరుకి పూర్తికావాలి. రేషన్ కార్డుల విభజన, కుటుంబ సభ్యుల పేర్ల చేర్పు, తొలగింపు ప్రక్రియను మరింత సులభతరం చేయాలి. అన్ని శాఖల సమాచారాన్ని డేటా లేక్‌తో అనుసంధానించాలి. అభ్యర్థి ఆధార్ నంబరు సహాయంతో వారికి సంబంధించిన సర్టిఫికెట్లతో పాటు వాటిని ఎవరు జారీ చేశారో కూడా తెలియాలి. ఆధార్ నంబరుతో సర్టిఫికెట్లన్నీ డిజీ వెరిఫై చేయాలి. దీనివల్ల అధికారుల పని 99 శాతం పారదర్శకంగా, సులువుగా పూర్తవుతుంది’ అని మంత్రి తెలిపారు.
వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొందాం
ఈ ఏడాది వర్షాభావ పరిస్థిలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు చర్యలు చేపడదామని లోకేశ్ సూచించారు. దీనికి అనుగుణంగా ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. జల వనరులు, వ్యవసాయం, ఉద్యానవన శాఖలతో పాటు ఇతర శాఖలన్నీ సమన్వయంతో ప్రణాళికలు అమలు చేయాలన్నారు. నీటి వృథాను అరికట్టాలని, భూగర్భ జలమట్టాలపై రోజువారీ పరిశీలన జరగాలని స్పష్టం చేశారు. రాయలసీమలో నీటి ఎద్దడి లేకుండా కార్యాచరణను అమలు చేయాలని పేర్కొన్నారు. యూరియా సరఫరాపై మంత్రి ఆరా తీశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్తు డిమాండ్ పెరగడంపై దృష్టి సారించాలని ఇంధన శాఖను ఆదేశించారు. జల విద్యుదుత్పత్తి తగ్గడంతో థర్మల్, సౌర, పవన విద్యుత్తు ఉత్పత్తి, వినియోగాన్ని నిరంతరం సమీక్షించాలని అన్నారు. భూగర్భ జలాలు, విద్యుత్తు వినియోగం వంటి సమాచారాన్ని అనుక్షణం ‘అవేర్’లో పేర్కొనాలని సూచించారు. విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని, ఆర్టీజీఎ్‌సలోని అవేర్ విభాగం ఎప్పటికప్పుడు సరఫరాను సమీక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేయాలని లోకేశ్ ఆదేశించారు.
మార్పునకు టీచర్లు నాయకత్వం వహించాలి: లోకేశ్
కూటమి ప్రభుత్వం టీచర్లను లీడర్లుగా భావిస్తోందని, మంచి ఫలితాలు సాధించేవారికి ప్రత్యేక గుర్తింపునిస్తుందని మంత్రి లోకేశ్ అన్నారు. సింగపూర్‌లో విద్యా విధానాల అధ్యయనానికి ఇటీవల వెళ్లివచ్చిన 37 మంది ఉత్తమ టీచర్లతో శుక్రవారం ఉండవల్లిలో ఆయన సమావేశమయ్యారు. సింగపూర్‌లో ఉన్న విధానాలను వారు మంత్రికి వివరించారు. లోకేశ్ మాట్లాడుతూ... ‘విద్య ద్వారానే మార్పు సాధ్యం. సమాజంలో మార్పునకు నాయకత్వం వహించే లీడర్లు ఉపాధ్యాయులు. స్వర్ణాంధ్ర సాధనలో విద్యాశాఖది కీలక పాత్ర. సింగపూర్‌లో మీరు నేర్చుకున్న అంశాలను ఇక్కడి పాఠశాలల్లో అమలు చేయాలి. ఇతర టీచర్లకూ నేర్పాలి. మనం చేపట్టిన సంస్కరణల వల్ల లక్ష మంది విద్యార్థులు ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోకి మారారు. ఇప్పుడు మనం ఇతర రాష్ర్టాలతో కాదు, ఇతర దేశాలతో పోటీ పడాలి. అభ్యసన ఫలితాలు, అనలిటికల్ థింకింగ్‌పై దృష్టిసారించాలి’ అన్నారు.
