జగన్ క్షమాపణ చెప్పాలి
ABN , Publish Date - Jun 13 , 2026 | 05:56 AM
మెగా డీఎస్సీపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని నిరూపించినందున, ఆయన బేషరతుగా రాష్ట్ర యువతకు క్షమాపణలు చెప్పాలని మంత్రి లోకేశ్ డిమాండ్ చేశారు. డీ
డీఎస్సీపై చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలని నిరూపించాం
మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తిగా సమర్థనీయం: లోకేశ్
అమరావతి, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని నిరూపించినందున, ఆయన బేషరతుగా రాష్ట్ర యువతకు క్షమాపణలు చెప్పాలని మంత్రి లోకేశ్ డిమాండ్ చేశారు. డీఎస్సీపై జగన్, వైసీపీ వరుసగా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో లోకేశ్ శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించారు. వైసీపీ, జగన్ చేసిన ప్రతి ఆరోపణను అబద్ధమని ప్రభుత్వం నిరూపించిందని స్పష్టం చేశారు. ‘జగన్ చేసిన ఆరోపణల్లో ఒక్కటీ నిజం లేదు. గణాంకాలతో సహా ప్రభుత్వం అవి తప్పుడు ఆరోపణలని నిరూపించింది. ఇదే అంశంపై వేసిన పిటిషన్లను న్యాయస్థానాలు కూడా తిరస్కరించాయి. జగన్ రెడ్డి చేసిన తప్పుడు ప్రచారం మొత్తం ఇప్పుడు బట్టబయలైంది. మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తిగా సమర్థనీయం. టీచర్లు కావాలనుకుంటున్న వేలాది మంది యువతకు అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ఇకనుంచి దృష్టి సారిస్తుంది. వైసీపీ నాయకత్వం తప్పుడు సమాచారంతో లక్షలాది మంది అభ్యర్థులను తప్పుదోవ పట్టిస్తూ వారిలో అనవసరమైన ఆందోళన సృష్టిస్తోంది’ అని లోకేశ్ పేర్కొన్నారు. క్రీడా మెడల్స్‌కు సంబంధించి సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగం సాధించలేకపోయిన దుర్గయ్య అనే డీఎస్సీ అభ్యర్థిని జగన్ గురువారం ప్రెస్‌మీట్‌లో తన పక్కన కూర్చోబెట్టుకుని... కావాలనే అన్యాయం చేశారని ఆరోపణలు చేశారు. దీనిపై క్రీడా శాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్ అదే రోజు సాయంత్రం ప్రెస్‌మీట్‌లో వాస్తవాలను వివరించారు. ఆర్చరీలో గోల్డ్ మెడల్ సాధించిన వివరాలను సమర్పించడంలో తాను విఫలమయ్యానని దుర్గయ్య హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఈ వీడియోను కూడా లోకేశ్ షేర్ చేశారు.