స్టీల్ ప్లాంట్‌ను కాపాడిందే మేం
ABN , Publish Date - Jun 10 , 2026 | 05:52 AM
కేజీహెచ్ మార్చురీ వద్ద మృతుల కుటుంబ సభ్యులను లోకేశ్ పరామర్శిస్తున్న సమయంలో, ఆయనకు కార్మిక సంఘాలు, వామపక్షాల నాయకులు అడ్డుతగిలారు.
బాధితులతో భేటీలో అడ్డు తగిలిన కార్మిక నేతలకు లోకేశ్ స్పష్టీకరణ
మృతుల కుటుంబీకులతో మాట్లాడేందుకు వచ్చా... గొడవ వద్దని హితవు
విశాఖపట్నం, జూన్ 9(ఆంధ్రజ్యోతి): కేజీహెచ్ మార్చురీ వద్ద మృతుల కుటుంబ సభ్యులను లోకేశ్ పరామర్శిస్తున్న సమయంలో, ఆయనకు కార్మిక సంఘాలు, వామపక్షాల నాయకులు అడ్డుతగిలారు. ప్లాంటును పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ఉద్యోగులపై ఒత్తిడి కూడా కారణమైందంటూ పెద్ద పెద్దగా మాట్లాడటం మొదలుపెట్టారు. వారిని వారించిన మంత్రి లోకేశ్, తనను బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడనివ్వాలని కోరారు. మాట్లాడే స్వేచ్ఛ తనకు ఉందని, కుటుంబాలను కలిసేందుకు తాను వచ్చానన్నారు. రాజకీయాలు చేయాలనుకోవడం మంచిది కాదని, రాజకీయాలే చేయాలనుకుంటే బయటకు వెళ్లాలని కోరారు. గొడవ వద్దంటూ వారించినప్పటికీ నినాదాలు చేయడంతో మంత్రి తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఉక్కు ఫ్యాక్టరీని కాపాడిందేతామని, ఈయన (పల్లాను చూపిస్తూ) పోరాటం చేశారన్నారు. ‘నన్ను మాట్లాడమంటారా? వద్దా?’ అని ప్రశ్నించారు. తాను మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు తాను వచ్చానని... మీ కుటుంబాల్లో ఎవరూ చనిపోలేదు కదా అని వారిని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలతో తనను మాట్లాడనివ్వాలని గట్టిగా చెప్పారు. ‘గొడవ ఎందుకు చేస్తున్నారు? గొడవ పెట్టుకోవడానికి వస్తే దండం... ’’ అంటూ ఆగ్రహించారు.
స్టీల్‌ప్లాంటులోనే ఉండిపోయిన శ్రీనివాస వర్మ
స్టీల్‌ప్లాంటులో ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసి కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ సోమవారం రాత్రి కర్మాగారానికి చేరుకున్నారు. కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. అక్కడ నుంచి మళ్లీ స్టీల్‌ప్లాంటుకు చేరుకున్నారు. ఉదయం వరకూ ప్రమాద స్థలిలోనే ఉండి ఉద్యోగులతో, కార్మికులతో మాట్లాడి వారిలో ధైర్యం నింపారు. ఎస్‌ఎంఎస్ విభాగంలో ప్రమాదం జరగడం దురదృష్టకరమని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు చేపడుతున్నామని ఆయన అన్నారు.
బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ
స్టీల్ ప్లాంటులోని ఎస్‌ఎంఎస్ విభాగంలో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు, గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి అధికారులు ఆర్ధిక సహాయం అందించారు. కొంతమందికి మంగళవారం స్టీల్‌ప్లాంటు అధికారులు చెక్కులు అందజేశారు.
ప్రమాద కారణాలపై దర్యాప్తు: వాసంశెట్టి సుభాశ్
స్టీల్‌ప్లాంటులో ప్రమాదం సంభవించడం దురదృష్టకరమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ అన్నారు. మంగళవారం ఆయన ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నామని, నిర్లక్ష్యమా, మరేదన్నా కారణం ఉందా... అన్న విషయం తెలుసుకుంటామని తెలిపారు.