అండగా ఉంటాం
ABN , Publish Date - Jun 10 , 2026 | 04:09 AM
స్టీల్‌ప్లాంటు ప్రమాద బాధిత కుటుంబాలకు జీవితాంతం అండగా ఉంటామని మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా..
బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పిన డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్
చెక్కులు పంపిణీ చేసిన అధికారులు
ఎస్‌ఎంఎస్-1లో నిలిచిన ఉత్పత్తి
ఉక్కు ప్రమాదంపై త్రిసభ్య కమిటీ
విశాఖ కేజీహెచ్ వద్ద వారికి పరామర్శ
మృతుల కుటుంబీకుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని వెల్లడి
సెవెన్ హిల్స్‌లో క్షతగాత్రులకు పరామర్శ
విశాఖపట్నం, జూన్ 9(ఆంధ్రజ్యోతి): స్టీల్‌ప్లాంటు ప్రమాద బాధిత కుటుంబాలకు జీవితాంతం అండగా ఉంటామని మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన మంగళవారం ఉదయం కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి విశాఖ కేజీహెచ్ మార్చురీ వద్ద ఉన్న మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వపరంగా అన్నివిధాలుగా అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. దీనికోసమే ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మతోపాటు తాను వచ్చినట్టు తెలిపారు. అందరం కలిసి పోరాడడం వల్లే స్టీల్ ప్లాంటును కాపాడుకోగలిగామని లోకేశ్ పేర్కొన్నారు. ప్రమాదంపై విచారణకు నియమించిన కమిటీ నివేదిక వచ్చిన తరువాత తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబ సభ్యులు ఒక్కొక్కరితో లోకేశ్ మాట్లాడి వారి వివరాలను తెలుసుకున్నారు. మళ్లీ ఒక్కొక్కరి ఇంటికి వచ్చి కలుస్తానని మంత్రి హామీ ఇచ్చారు. బాధితులకు న్యాయం జరిగేంతవరకు పూర్తి బాధ్యతను తాను చూసుకుంటానన్నారు. అనంతరం ఆయన సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కలిసి పరామర్శించారు. అక్కడి వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని, అందిస్తున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి వద్దే ఉన్న క్షతగాత్రుల కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.
స్టీల్ తయారీ ప్రాసెస్‌లో లోపం లేదు
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో తయారీ ప్రాసె్‌సలో లోపం లేదని మంత్రి లోకేశ్ ప్రకటించారు. ‘‘ఎన్డీయే ప్రభుత్వం రూ.15 వేల కోట్ల ప్యాకేజీతో స్టీల్ ప్లాంటును కాపాడింది. ప్లాంటు నిలదొక్కుకుంటున్న సమయంలో ప్రమాదం జరగడం బాధాకరం.’’ అని లోకేశ్ అన్నారు. చనిపోయినవారు పర్మినెంట్ ఉద్యోగులైనా, కాంట్రాక్టు వర్కర్లు అయినా వారి కుటుంబంలో చదువుకున్న ఒకరికి శాశ్వత ఉద్యోగం ఇవ్వడానికి మంత్రి కుమారస్వామి హామీ ఇచ్చారని, దానిని అమలు చేస్తారని లోకేశ్ పేర్కొన్నారు. కార్మిక సంఘా లు విశాఖ ఉక్కుకు సొంత గనులు అడుగుతున్నాయని, తాము పక్కనే అనకాపల్లి జిల్లాలో మిత్తల్‌కు స్లర్రీ పైపులైన్‌కు అనుమతి ఇచ్చామని, అలాంటిదే విశాఖ ఉక్కుకూ తీసుకువస్తామని మంత్రి లోకేశ్ ప్రకటించారు. ఆయన వెంట భూపతిరాజు శ్రీనివాసవర్మ, అనిత, శ్రీభరత్, పల్లా శ్రీనివాసరావు ఉన్నారు.