Share News

ఉరిమిన ఉత్సాహం

ABN , Publish Date - Feb 27 , 2026 | 04:00 AM

ప్రజాసంబంధ వ్యవహారాలతో నిత్యం తలమునకలై ఉండే ప్రజాప్రతినిధులు మూడు రోజులపాటు జరిగిన క్రీడా పోటీల్లో గెలుపోటములను పక్కనబెట్టి ఒత్తిడిని జయించారు.

ఉరిమిన ఉత్సాహం

  • గెలుపోటముల్లో ఒత్తిడిని జయించిన నేతలు

  • క్రికెట్‌ ఫైనల్స్‌లో మంత్రి మనోహర్‌ జట్టు విజయం

  • ముగిసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఆటలపోటీలు

  • బాగా సందడి చేసిన నాదెండ్ల, అనిత, సంధ్యారాణి, అచ్చెన్న, మండిపల్లి

విజయవాడ, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): ప్రజాసంబంధ వ్యవహారాలతో నిత్యం తలమునకలై ఉండే ప్రజాప్రతినిధులు మూడు రోజులపాటు జరిగిన క్రీడా పోటీల్లో గెలుపోటములను పక్కనబెట్టి ఒత్తిడిని జయించారు! విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన పోటీల్లో ఆద్యంతం ఉల్లాసంగా గడిపారు. అన్ని ఆటల్లో సభ్యులు పోటాపోటీగా.. పాల్గొన్నారు. గురువారంతో ఈ పోటీలు ముగియగా.. చివరిరోజు మంత్రులు మనోహర్‌, రాంప్రసాద్‌రెడ్డి, అనిత, సంధ్యారాణి, అచ్చెన్నాయుడు బాగా సందడి చేశారు.

బుచ్చయ్య వెరీ యంగ్‌

సీనియర్‌ నేత.. రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరిపై ఇతర ఎమ్మెల్యేలు సరదా సెటైర్లు వేశారు. బుచ్చయ్య యువ ఎమ్మెల్యేలతో కలిసి క్రికెట్‌ ఆడి.. ఉత్సాహంగా పరుగులు తీయడంతో.. అందరిలో బుచ్చయ్య చౌదరే యంగ్‌ అంటూ కితాబు ఇచ్చారు. దీనికి స్పందించిన ఆయన.. రాష్ట్రంలో క్రీడాకారులకు కొరత లేదని, వారికి తగిన వసతులు మాత్రం లేవని కౌంటర్‌ వేశారు. క్రీడల ద్వారా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు ఉన్నాయని, వాటిపై శాప్‌ దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరుగుతున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఆటల పోటీలకు స్పాన్సర్‌షిప్‌ లేకపోవడం లోటుగా ఉందని ఆయన నవ్వుతూ అన్నారు.

స్పీకర్‌ గారూ... ఆధార్‌కార్డులు చెక్‌ చేయండి

ఆటల పోటీల్లో భాగంగా 70ఏళ్లకు పైబడిన వారికి జావెలిన్‌త్రో నిర్వహించారు. ఇందులో గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కామినేని శ్రీనివాసరావుతోపాటు పలువురు పాల్గొన్నారు. అదే సమయంలో మంత్రులు అనిత, సంధ్యారాణి, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ కూడా పాల్గొంటామని వచ్చారు. వారిని ఉద్దేశించి స్పీకర్‌ గారూ... సభ్యుల ఆధార్‌కార్డులు చెక్‌ చేయండని బుచ్చయ్య అన్నారు. 30, 40 ఏళ్లు ఉన్న వాళ్లు బహుమతి గెలచుకోవడానికి 70 ఏళ్ల కేటగిరిలో ఆడుతున్నారన్నారు. ఆధార్‌కార్డులో పుట్టిన తేదీని పరిశీలించి ఆటలోకి అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.


అచ్చెన్నపై ‘మనోహర’ విజయం

క్రికెట్‌ తుది పోరులో మంత్రి అచ్చెన్నాయుడు జట్టుపై మంత్రి నాదెండ్ల మనోహర్‌ జట్టు విజయం సాధించింది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న మనోహర్‌ జట్టు 12 ఓవర్లలో 108 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌ ప్రారంభించిన అచ్చెన్నాయుడు జట్టు 100 పరుగులకు అవుటయింది. ఈ మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు ఫోర్లు, సిక్స్‌లు కొట్టినప్పుడు టపాసులు పేల్చి జట్టు సభ్యుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించారు.

గ్రౌండ్స్‌లో అనిత డ్యాన్స్‌

హోంమంత్రి అనిత క్రికెట్‌ గ్రౌండ్‌లో చేసిన డ్యాన్స్‌ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. బుధవారం డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, మంత్రి అచ్చెన్నాయుడు జట్ల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ జరిగింది. వారితో కలిసి ఆమె క్రికెట్‌ ఆడారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి అవుట్‌కావడంతో ఫీల్డింగ్‌లో ఉన్న అనిత రెండు చేతులు ఊపుతూ చిన్నపాటి స్టెప్‌ వేశారు.

స్పీకర్‌పై కోపంగా ఉంది: కేశినేని చిన్ని

స్పీకర్‌ అయ్యన్నపాత్రుడుపై తనకు కోపంగా ఉందని ఎంపీ కేశినేని చిన్ని సరాదాగా వ్యాఖ్యానించారు. స్టేడియంలో జరుగుతున్న ఆటల పోటీలను తిలకించడానికి చిన్ని వచ్చారు. దక్షిణాది రాష్ట్రాల క్రికెట్‌ పోటీ నిర్వహణపై స్పీకర్‌ చేసిన ప్రతిపాదనపై చిన్ని మాట్లాడారు. ఈ ఆటల పోటీల్లో ఎంపీలకు అవకాశం ఇవ్వలేదన్నారు. దక్షిణాది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో విశాఖ స్టేడియంలో ఫ్లడ్‌ లైట్ల వెలుగులో మ్యాచ్‌ను నిర్వహిస్తామని చెప్పారు.

వద్దయ్యా అన్నా... డిప్యూటీ స్పీకర్‌ వినలేదు

‘మనస్సులో ఉన్న క్రీడాస్ఫూర్తిని డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు ఆపులేకపోయారు. వద్దయ్యా మనకెందుకు అని చెప్పినా వినలేదు’ అని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు వ్యాఖ్యానించారు. క్రికెట్‌ ఆడుతుండగా డిప్యూటీ స్పీకర్‌ పరుగులు తీస్తూ పడిపోవడంతో ఎడమచేతి మణికట్టు వద్ద ఎముక విరగడంపై ఆయన స్పందించారు. ‘మాకు కొంచెం ఒళ్లెక్కువ. అందువల్ల వద్దన్నా. అయినా రఘరామ క్రీడాస్ఫూర్తిని ఆపులేక ఆడారు. చేయికి గాయమైంది. హైదరాబాద్‌లో శస్త్రచికిత్స చేశారు. రెండు, మూడు రోజుల్లో కోలుకుంటారు’ అని అన్నారు. సౌత్‌జోన్‌ ప్రజాప్రతినిధుల పోటీలు విశాఖలో నిర్వహించాలని స్పీకర్‌ తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు.


వికలాంగుల కోటాలో పింఛన్లు అడుగుదాం!

క్రీడల్లో గాయపడ్డ వారితో బోండా సరదా వ్యాఖ్య

అమరావతి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): క్రీడా పోటీల్లో గాయపడ్డ ప్రజాప్రతినిధులకు వికలాంగుల కోటా వర్తింప చేసి పింఛను ఇవ్వాలని సీఎంని కోరుదామని ఎమ్మెల్యే బోండా ఉమా సరదాగా వ్యాఖ్యానించారు. మూడు రోజులుగా జరిగిన క్రీడా పోటీల్లో డిప్యూటీ స్పీకర్‌ రఘురామరాజుతో సహా పలువురు ప్రజా ప్రతినిధులు గాయపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి కాలు విరగడంతో ఆయన కర్ర సాయంతో గురువారం అసెంబ్లీకి వచ్చారు. టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ చేతికి కట్టుతో వచ్చారు. వీరిద్దరూ ఒకే కారులో వచ్చి.. ఒకరికొకరు సాయంగా అసెంబ్లీ లాబీలోకి వస్తున్న సమయంలో బోండా ఉమా ఎదురయ్యారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ.. గాయపడిన వారు చట్టసభల సభ్యులు కాబట్టి అవసరమైతే అత్యవసర బిల్లు పెట్టిద్దామని అన్నారు. దీనిపై పార్ధసారథి స్పందిస్తూ.. అలాంటి ప్రతిపాదన పెడితే సగం మంది సభ్యులకు వర్తిస్తుందని, తమతోపాటు చాలా మంది గాయపడ్డారని అన్నారు.


త్వరలో దక్షిణాది ఎమ్యెల్యేల క్రీడాపోటీలు: స్పీకర్‌ అయ్యన్న

దక్షిణాదిలోని ఆరు రాష్ట్రాలకు చెందిన శాసనసభ్యులతో విశాఖపట్నం వేదికగా క్రీడాపోటీలను నిర్వహించనున్నట్టు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించి భారీ క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తామని చెప్పారు. విశాఖలో అంతర్జాతీయ క్రికెట్‌ పోటీలతో పాటు బీచ్‌ వాలీబాల్‌, కబడ్డీ నిర్వహణకు అనుకూలమైన వాతావరణం ఉందన్నారు. ఈ మూడింటిలో ఏదో ఒక క్రీడను నిర్వహిస్తామని తెలిపారు. ఈ మెగా క్రీడా సంబరాల ద్వారా దక్షిణాది రాష్ట్రాల మధ్య ఐక్యతను చాటడమే కాకుండా, రాజకీయంగా ఎలాంటి సమస్యలు, భిన్నాభిప్రాయాలు ఉన్నా క్రీడాస్ఫూర్తితో అంతా ఒకే వేదికపైకి వస్తాయనే బలమైన సందేశాన్ని దేశం మొత్తానికి చాటిచెప్పవచ్చని ఆకాంక్షించారు. ఈ ప్రతిష్టాత్మక క్రీడాపోటీలను ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని ఆధ్వర్యంలో నిర్వహిస్తామని స్పీకర్‌ వెల్లడించారు.

Updated Date - Feb 27 , 2026 | 04:01 AM