అయోధ్య లడ్డూలకు ప్రత్యేక నెయ్యా?
ABN , Publish Date - Feb 09 , 2026 | 03:41 AM
అయోధ్యకు పంపిన లడ్డూ ప్రసాదాన్ని వేరే డెయిరీల నుంచి తెప్పించిన ప్రత్యేక నెయ్యితో తయారు చేశామని మీరే చెబుతున్నారంటే ఆ ఐదేళ్లలో భక్తులకు...
అంటే తిరుమల ప్రసాదంలో కల్తీ నిజమేనా?
ఈ విషయం గురించి మీకు ముందే తెలుసా?
దుర్మార్గానికి పాల్పడి ఎదురుదాడికి సిగ్గులేదా?
భూమన, పేర్నిపై మంత్రి నాదెండ్ల మనోహర్ ధ్వజం
తెనాలి, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): ‘‘అయోధ్యకు పంపిన లడ్డూ ప్రసాదాన్ని వేరే డెయిరీల నుంచి తెప్పించిన ప్రత్యేక నెయ్యితో తయారు చేశామని మీరే చెబుతున్నారంటే ఆ ఐదేళ్లలో భక్తులకు పంచిన తిరుమల లడ్డూ తయారీకి వాడింది కల్తీ నెయ్యేనని ఒప్పుకున్నట్టే కదా! ఈ కల్తీ విషయం కూడా మీకు ముందే తెలుసా! ఇంత దుర్మార్గం తెలిసే చేసి కూడా ఈ ఎదురుదాడేంటి? మీకసలు సిగ్గే లేదా?’’ అంటూ వైసీపీ నేతలపై మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రంగా మండిపడ్డారు. చౌకధరల దుకాణం ద్వారా కిలో రూ.20కే గోధుమపిండి అందించే కార్యక్రమాన్ని ఆదివారం ఆయన గుంటూరు జిల్లా తెనాలిలో ప్రారంభించారు. తర్వాత మంత్రి విలేకరులతో మాట్లాడారు. అయోధ్యకు పంపిన లడ్డూలను ప్రత్యేక నెయ్యితో తయారు చేయించామని వైసీపీ నాయకులు కరుణాకరరెడ్డి, పేర్ని నాని చెప్పడంపై విస్మయం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు చెందిన వి.కె. డెయిరీ ఎసెన్షియల్స్, పలమనేరుకు చెందిన పరాగ్ మిల్క్ ఫుడ్స్ అనే రెండు సంస్థల నుంచి 2,010 కిలోల స్వచ్ఛమైన నెయ్యి తీసుకుని అయోధ్యకు లడ్డూలు తయారు చేసి పంపామని వారు చెప్పడంపై మండిపడ్డారు. ఆ లక్ష లడ్డూల తయారీలో వేరే నెయ్యి వాడామని చెబుతున్నారంటే, వారు అధికారంలో ఉన్న ఐదేళ్లలో భక్తులకు పంపిణీ చేసిన లడ్డూల తయారీకి కల్తీ నెయ్యి వాడారని తేలిపోయిందని మంత్రి మనోహర్ పేర్కొన్నారు.