Minister N. Manohar: ధాన్యం కొన్న రోజే సొమ్ము చెల్లింపు
ABN , Publish Date - Jan 20 , 2026 | 05:02 AM
ఇకపై రైతుల నుంచి ఉదయం ధాన్యం కొనుగోలు చేస్తే.. అదే రోజు సాయంత్రానికి సదరు రైతు ఖాతాలో మద్దతు ధర ప్రకారం సొమ్ము జమ చేసేందుకు చర్యలు తీసుకోవాలని...
అధికారులకు మంత్రి నాదెండ్ల ఆదేశం
తుది దశలో ఖరీఫ్ సీజన్ కొనుగోళ్ల ప్రక్రియ
24 గంటల్లోపే 94 శాతం నగదును రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడి
అమరావతి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): ఇకపై రైతుల నుంచి ఉదయం ధాన్యం కొనుగోలు చేస్తే.. అదే రోజు సాయంత్రానికి సదరు రైతు ఖాతాలో మద్దతు ధర ప్రకారం సొమ్ము జమ చేసేందుకు చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సోమవారం విజయవాడలోని సివిల్ సప్లయిస్ భవన్‌లో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయని, తిరుపతి, నెల్లూరు, బాపట్ల, గుంటూరు తదితర జిల్లాల్లో ఇంకా కొనుగోళ్లు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి 24 గంటల్లోపే 94 శాతం నగదును రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. ఈ సీజన్‌లో ఎదురైన సమస్యలు, లోపాలపై సమీక్షించుకొని.. వచ్చే రబీ సీజన్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని అధికారులకు సూచించారు. రబీ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
క్షేత్రస్థాయిలో రైతు సేవా కేంద్రాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే విధంగా శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 6,83,623 మంది రైతుల నుంచి 41.69 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ధాన్యంలో తేమ శాతం, జీపీఎస్, రవాణా సమస్యలను అధిగమించామని, రైతులు ఇబ్బందులు పడకుండా తొలిసారి రైళ్ల ద్వారా కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ధాన్యం తరలింపునకు ఏర్పాట్లు చేశామని వివరించారు. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీ ఎస్.డిల్లీరావు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన సివిల్ సప్లయిస్ కొత్త డైరెక్టర్
సివిల్ సప్లయిస్ డైరెక్టరుగా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారిణి శ్రీవాస్ నుపూర్ అజయ్‌కుమార్ సోమవారం ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా, పారదర్శకతకు ప్రాధాన్యమిస్తూ వేగవంతమైన సేవలు అందించడం ద్వారా ప్రజాపంపిణీ వ్యవస్థను ముందుకు తీసుకువెళ్లాలని మంత్రి సూచించారు.