Minister Nara Lokesh: విద్వేష విషం చిమ్మితే కోరలు పీకేస్తాం
ABN , Publish Date - Jan 07 , 2026 | 03:09 AM
సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా విద్వేషాన్ని రెచ్చగొట్టే పోస్టులు, అసత్య ప్రచారాలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి లోకేశ్ హెచ్చరించారు.
సోషల్ మీడియాలో అసభ్య పోస్టులకు తావులేదు: లోకేశ్
సైబర్ కేసుల్లో నెలలో చార్జిషీట్: హోంమంత్రి అనిత
అమరావతి, జనవరి 6(ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా విద్వేషాన్ని రెచ్చగొట్టే పోస్టులు, అసత్య ప్రచారాలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి లోకేశ్ హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయాలపై సద్విమర్శలను స్వాగతిస్తామని, కుట్రపూరితంగా దురుద్దేశంతో విషం చిమ్మితే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. ‘సోషల్ మీడియా జవాబుదారీతనం- పౌరుల రక్షణ’ అంశంపై మంగళవారం సచివాలయంలో జరిగిన మంత్రుల సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొందరు పనిగట్టుకుని ఆర్గనైజ్డ్‌గా సోషల్ మీడియాలో అసభ్యకర, వివాదాస్పద పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐ ఆధారిత డీప్ ఫేక్ కంటెంట్‌ను సృష్టించి మొబైల్ ఫోన్లలోకి వదులుతున్నారని చెప్పారు. ఇటువంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉద్దేశపూర్వక తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవడానికి కేంద్రం ప్రవేశపెట్టిన సహయోగ్ ఇంటిగ్రేషన్ పోర్టల్‌ను సమర్థంగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. సోషల్ మీడియా కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేయడానికి సమయం పడుతోందని, సైబర్ క్రైమ్ బిల్డింగ్ ఏర్పాటు చేసి నెల రోజుల్లోగా చార్జిషీట్ వేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా.. మహిళల రక్షణ కోసం ప్రజ్వల పౌండేషన్ ద్వారా పోరాటం చేస్తున్న సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్ సచివాలయంలో మంత్రి అనితతో భేటీ అయ్యారు.
నేడు కోర్టుకు మంత్రి లోకేశ్
మంత్రి లోకేశ్ బుధవారం విశాఖపట్నం కోర్టుకు హాజరుకానున్నారు. జగన్ పత్రిక తనపై ప్రచురించిన కథనంపై ఆయన గతంలో పరువునష్టం కేసు వేశారు. విశాఖలోని 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో కేసు విచారణ జరుగుతోంది.