అమ్మభాషను మరవొద్దు
ABN , Publish Date - Feb 26 , 2026 | 04:49 AM
కెరీర్ కోసం ఇంగ్లిషులో నైపుణ్యం కనబరుస్తూనే మాతృభాష తెలుగును మర్చిపోవద్దని మంత్రి లోకేశ్ విద్యార్థులకు సూచించారు.
అసెంబ్లీ చూసేందుకు వచ్చిన విద్యార్థులతో లోకేశ్
అమరావతి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): కెరీర్ కోసం ఇంగ్లిషులో నైపుణ్యం కనబరుస్తూనే మాతృభాష తెలుగును మర్చిపోవద్దని మంత్రి లోకేశ్ విద్యార్థులకు సూచించారు. విదేశాల్లో ఎక్కువ కాలం చదువుకోవడం వల్ల మొదట్లో తెలుగు రాక తాను ఇబ్బంది పడిన విషయాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. అసెంబ్లీ సమావేశాలను చూడటానికి సత్తెనపల్లి నియోజకవర్గం సుగాలి జెడ్పీ హైస్కూల్ నుంచి వచ్చిన విద్యార్థులతో లోకేశ్ బుధవారం అసెంబ్లీ లాబీలో కాసేపు ముచ్చటించారు. పిల్లలే రాష్ట్ర భవిత అనీ, రాబోయే కాలంలో చరిత్ర సృష్టించేది మీరేనని అన్నారు. ఇంగ్లీషులో చదువుకుంటున్నా.. అమ్మలాంటి తెలుగు భాషను మాత్రం మరువొద్దన్నారు. అసెంబ్లీ చూడటం ఎలా ఉంది? మీరు చూస్తున్నప్పుడు అసెంబ్లీలో ఏ అంశంపై చర్చ జరిగింది? అని ఆరా తీయగా, ప్రత్యక్షంగా చూడటం వల్ల చాలా విషయాలు తెలిశాయని విద్యార్థులు చెప్పారు. ప్రభుత్వ యూనిఫామ్ ఎలా ఉంది? టీచర్లు పాఠాలు ఎలా చెబుతున్నారు? మధ్యాహ్న భోజనం రుచిగా ఉంటుందా? రాగిజావ అందుతోందా? అని విద్యార్థుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.